ఆ రోజు మలింగాను మడతబెట్టిన కోహ్లీ! 12 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసం​..

Virat Kohli vs Sri Lanka: విరాట్‌ కోహ్లీ ఇప్పుడో సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌.. కానీ, కెరీర్‌ తొలినాళ్లలోనే అతను సృష్టించిన విధ్వంసాలు అనేకం. అందులో ఓ విధ్వంసానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆ ఊచకోత గురించి గుర్తుచేసుకుందాం..

Virat Kohli vs Sri Lanka: విరాట్‌ కోహ్లీ ఇప్పుడో సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌.. కానీ, కెరీర్‌ తొలినాళ్లలోనే అతను సృష్టించిన విధ్వంసాలు అనేకం. అందులో ఓ విధ్వంసానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆ ఊచకోత గురించి గుర్తుచేసుకుందాం..

రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌, కింగ్‌, గోట్‌(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌).. ఇలాంటి బిరుదులు ఓ క్రికెటర్‌ పేరు ముందు చేరాయంటే.. అతను ఎంతో సాధించి ఉండాలి. పైగా క్రికెట్‌ను ఓ మతంలా భావించే దేశంలో అంత అభిమానం పొందాలంటే.. బాగా ఆడితే కుదరదు.. గొప్పగా ఆడినా సరిపోదు.. అద్భుతంగా ఆడాలి. ఇంకెవరూ ఆడలేని విధంగా ఆడాలి. అప్పుడే మన దేశంలో ఓ క్రికెటర్‌ను అభిమానులు నెత్తినపెట్టుకుంటారు. అలా ఆడడాడు, ఆడుతున్నాడు కనుకే.. విరాట్‌ కోహ్లీ అంటే క్రికెట్‌ ప్రపంచం మొత్తం అభిమానిస్తుంది, ఆరాధిస్తుంది. కోహ్లీ అంటే కేవలం పేరు కాదు.. ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌. ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న కోహ్లీ.. కెరీర్‌ ఆరంభంలోనే తన విశ్వరూపం చూపించిన మ్యాచ్‌లు, ఇన్నింగ్సులు చాలా ఉన్నాయి. అందులో ఒకటి 12 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసం. 23 ఏళ్ల కుర్రాడు.. బంతులను బుల్లెట్స్‌లా వేసే మలింగా లాంటి ఓ భయంకరమైన బౌలర్‌ను భయపెట్టిన మ్యాచ్‌ అది. ఆ మ్యాచ్‌లో కోహ్లీని చూసి.. ప్రపంచ క్రికెట్‌ ఉలిక్కిపడింది. ‘ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్‌ ఉన్నాడు’ అంటూ లంక టీమ్‌లోని హేమాహేమీలు ఆశ్చర్యపోయారు. 12 ఏళ్ల క్రితం మలింగాను మడతపెట్టి.. లంక బౌలర్లను ఊచకోత కోసిన కోహ్లీ విధ్వంసం గురించి మరోసారి గుర్తుచేసుకుందాం..

2012 ఫిబ్రవరి 28.. కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య హోబర్ట్‌ వేదికగా వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ సిరీస్‌లో ఇండియా, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా కూడా పాల్గొంది. ఈ మూడు జట్ల మధ్య 12 లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఒక్కో టీమ్‌ మిగిలిన రెండు టీమ్స్‌తో నాలుగేసి మ్యాచ్‌లు ఆడింది. లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడింది టీమిండియా. అంతకంటే ముందు జరిగిన 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 4 ఓటములు, ఒక టై మ్యాచ్‌తో టీమిండియా ఇంటి బాటపట్టేందుకు రెడీగా ఉంది. కానీ, కొన్ని ఈక్వెషన్స్‌తో ఇంకా ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో లంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ, ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఏకంగా 320 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ స్కోర్‌ చూడగానే.. టీమిండియా అభిమానుల ఆశలు చచ్చిపోయాయి. అయితే.. 321 పరుగుల టార్గెట్‌ను కేవలం 40 ఓవర్లలో ఛేజ్‌ చేస్తేనే.. టీమిండియాకు ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 321 రన్స్‌ టార్గెట్‌ను 50 ఓవర్లలో ఛేజ్‌ చేస్తేనే గొప్ప.. అలాంటిది 40 ఓవర్లలో కొట్టాలంటే.. వామ్మో చాలా కష్టం. కానీ, అప్పుడే విరాట్‌ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. ఎంత పెద్ద కష్టం వస్తే.. అంత గొప్ప వీరుడు ఉద్భవిస్తాడు అనేలా కోహ్లీ.. లంక బౌలర్లపై జూలువిదిల్చిన సింహంలా విరుచుకుపడ్డాడు.

321 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సెహ్వాగ్‌(30 పరుగులు), సచిన్‌ టెండూల్కర్‌(39 పరుగులు) లాంటి హేమాహేమీలు త్వరగానే తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. కానీ, ఆడినంత సేపు వేగంగా ఆడారు. 86 పరుగుల వద్ద సచిన్‌ అవుటైన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీని చూసి.. లంక బౌలర్లు నవ్వుకున్నారు. సచిన్‌, సెహ్వాగ్‌లే ఏం చేయలేకపోయారు. బచ్చాగాడు.. వీడేం చేస్తాడని అనుకున్నారు. కానీ క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలబోయేవాడు వచ్చాడని వాళ్లకు తెలియదు. ప్రపంచ క్రికెట్‌పై కోహ్లీ దండయాత్రకు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పునాది పడింది. క్రీజ్‌లోకి వచ్చిన మొదలు.. లంక బౌలర్లను చీల్చిచెండాడు. ముఖ్యంగా లంక దిగ్గజం, తన వేగంతో, బౌలింగ్‌ యాక్షన్‌తో బ్యాటర్లను భయపెడుతున్న లసిత్‌ మలింగాను టార్గెట్‌ చేసి మరి కొట్టాడు. మలింగా బౌలింగ్‌లో కోహ్లీ ఆడుతున్న షాట్లు చూసి ‘రేయ్‌.. వాడు మలింగా అనుకుంటున్నావా? లేక లింగం మాయ్యా అనుకుంటున్నావా? అలా కొడుతున్నావ్‌?’ అంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు షాక్‌ అయ్యారు.

మొత్తంగా.. కేవలం 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సులతో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. ప్రపంచ క్రికెట్‌కు ఇంకో సచిన్‌ దొరికేశాడని కన్ఫామ్‌ చేసేశాడు యంగ్‌ విరాట్‌ కోహ్లీ. అతనికి తోడు రైనా సైతం 24 బంతుల్లో 40 పరుగులు చేసి మంచి సపోర్ట్‌ అందించాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన గంభీర్‌ 64 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే.. 40 ఓవర్లలో కొట్టాల్సిన టార్గెట్‌ కాస్త, కోహ్లీ ఊచకోత కారణంగా.. 36.4 ఓవర్లలోనే ఊదిపారేసింది టీమిండియా. ఆ ఇన్నింగ్స్‌తో కోహ్లీ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయింది. కానీ, శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో లంక విజయం సాధించడంతో.. టీమిండియా ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ, ఆ సిరీస్‌కు కోహ్లీ ఆడిన ఇన్నింగ్సే హైలెట్‌గా నిలిచింది. ‘నేను భాగమైన వన్డే మ్యాచ్‌ల్లో ఇది ఒక బెస్ట్‌ మ్యాచ్‌’ అని అప్పటి టీమిండియా కెప్టెన్‌ ధోని, ‘కోహ్లీ అలా ఆడితే మేం మాత్రం ఏం చేయగలం’ అంటూ అప్పటి లంక కెప్టెన్‌ మహేల జయవర్దనే అన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. కోహ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో. మరి 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments