కూతురి స్కూలు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్!

  • Author singhj Published - 05:18 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 05:18 PM, Sun - 27 August 23
కూతురి స్కూలు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్!

క్రికెట్​లో అవకాశాలు రావడం చాలా కష్టం. అలాంటిది కొందరికి ఛాన్సులు వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. మరికొందరు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మంచి పేరు తెచ్చుకున్నాక స్వయం తప్పిదాలతో జట్టుకు దూరమైపోతారు. అలాంటి వారిలో ఒకడు పాకిస్థాన్ బ్యాట్స్​మన్ ఉమర్ అక్మల్. ఇతను మరెవరో కాదు పాక్ స్టార్ వికెట్ కీపర్ క్రమాన్ అక్మల్ సోదరుడే కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచులోనే సెంచరీతో చెలరేగిన ఉమర్ అక్మల్.. అన్న కమ్రాన్​కు తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. తక్కువ కాలంలోనే జట్టులో కీలక ప్లేయర్​గా ఎదిగాడు.

స్టార్ ప్లేయర్​గా పేరు తెచ్చుకుంటున్న తరుణంలో ఉమర్ అక్మల్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకొని కెరీర్​ను నాశనం చేసుకున్నాడు. 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న ఉమర్​ క్రికెట్​కు దూరమయ్యాడు. ఫిక్సింగ్ కోసం బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని చెప్పకుండా దాచడంతో అతడిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే అదే సంవత్సరం తనను క్షమించాలని, శిక్షను తగ్గించాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్​ను ఆశ్రయించాడు అక్మల్. ఈ క్రమంలో అతడిపై ఉన్న నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో 2021లో ఉమర్​ మీద ఉన్న నిషేధాన్ని పీసీబీ ఎత్తివేసింది. కానీ ఆ తర్వాత పాక్ జట్టులో అతడికి చోటు దక్కలేదు.

తాజాగా ఒక ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై బ్యాన్ ఉన్న టైమ్​లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ ఉమర్ అక్మల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో తాను పడిన బాధలు తన శత్రువులకు కూడా రావొద్దన్నాడు. దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని పరీక్షిస్తాడని అక్మల్ అన్నాడు. ఆ టైమ్​లోనే చాలా మంది అసలు స్వరూపం బయటపడిందన్నాడు. కూతురి ఫీజు కట్టలేక 8 నెలల పాటు స్కూల్​కు పంపలేకపోయానంటూ ఉమర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కష్టకాలంలో తన భార్య వెన్నంటే ఉంటూ అండగా నిలిచిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఈ స్టార్ క్రికెటర్ ఉద్వేగానికి లోనయ్యాడు.

Show comments