క్రికెట్లో సరైన అవకాశాలు రాక ఎందరో ప్లేయర్లు బాధపడుతున్నారు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోక జట్టుకు దూరమవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ మొదట్లో మంచి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు షా. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తాడని అందరూ ఈ యంగ్ క్రికెటర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. భారత జట్టులోనూ అతడికి ఆడే ఛాన్స్ వచ్చింది.
టీమిండియా తరఫున వచ్చిన ఛాన్సులను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు పృథ్వీ షా. నిలకడగా పరుగులు చేయడంలో ఫెయిల్ అవ్వడంతో అతడికి ఉద్వాసన తప్పలేదు. మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు షా. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. అయినా అతడికి సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. అదే టైమ్‌లో ఐపీఎల్లో కూడా ఫెయిలవ్వడంతో టీమిండియా ద్వారాలు మూసుకుపోయాయి. బరువు పెరగడం, నిలకడ లేని ప్రదర్శన, వివాదాల్లో ఉండటంతో ఈ యంగ్ ఓపెనర్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపుతున్నారు.
పృథ్వీ షా సహచరుడైన శుబ్‌మన్ గిల్ భారత జట్టులో తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని ఆటతీరుతో టీమ్‌లో కీలక ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ షా మాత్రం జట్టులో చోటు దక్కించుకోవడానికే అష్టకష్టాలు పడుతున్నాడు. ఒకవేళ టీమ్‌లో ప్లేస్ దక్కినా ఆడే ఛాన్స్ రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడాలని ఫిక్స్ అయిన షా.. ఇటీవల అక్కడి దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతంగా ఆడాడు. చివరగా ఆడిన రెండు మ్యాచుల్లో డబుల్ సెంచరీ (244)తో పాటు అజేయ శతకం (125 నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అంతా బాగానే ఉంది, గ్రాండ్‌గా టీమిండియాలోకి పృథ్వీ షా రీ ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటున్న తరుణంలో గాయం రూపంలో దురదృష్టం మళ్లీ వెంటాడింది. దీంతో ఇండియాకు తిరిగొచ్చిన షా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. మోకాలి గాయం తీవ్రతరం కావడంతో కనీసం మూడ్నెళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని పృథ్వీ షాకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో పాపం.. షా లక్ బాగోలేదు, ఏం చేసినా అతడికి కలసి రావట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాయం కారణంగా త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో పాటు జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడని తెలుస్తోంది.
ఇదీ చదవండి: పాకిస్థాన్ ఫైనల్‌కు రాదు: భారత మాజీ క్రికెటర్
Prithvi Shaw set to be ruled out for 3-4 months. (Indian Express). pic.twitter.com/eH9MwUKng3
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2023