స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ మృతి

ప్రపంచ ప్రఖ్యాత లెగ్‌ స్పిన్నర్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మృతి చెందాడు. తన స్పిన్‌ మాయాజాలంతో దశాబ్ధంన్నర కాలం పాటు బంతితో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ… వందల వికెట్లు పడగొడుతూ… కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతని వయస్సు 52. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. థాయిలాండ్‌లోని కోహ్ సమీపంలో వార్న్‌ తన విల్లాలో అచేతనంగా పడి ఉండగా సిబ్బంది అతనిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయన 1969 సెప్టెంబరు 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు.

లెగ్‌బ్రేక్‌… గుగ్లీలతో వార్న్‌ 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సరిసమానంగా వికెట్లు తీస్తూ ప్రత్యేకతను చాటుకున్నాడు. వికెట్ల లెక్కలలో మురళీధరన్‌ కన్నా వెనుకబడినా, బంతిని గింగిరాలు తిప్పుతూ వార్న్‌ వికెట్లు సాధిస్తూ స్పిన్‌ బౌలింగ్‌కు కొత్త పాఠాలు నేర్పాడు. 2007 తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు సేవలందిస్తున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తరపున ఆడాడు. ఆయన కెప్టెన్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్‌ తొలి విజేతగా నిలిచింది. 2014 వరకు క్రీడాకారునిగా కొనసాగాడు. ప్రస్తుతం ఆ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఎంతోమంది లెగ్‌ స్పిన్నర్లు ఉన్నప్పటికీ షేన్‌ వార్న్ మాంత్రికునిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్థటన్‌, గ్రహం గూచ్‌, వెస్టిండీస్ కు చెందిన చంద్రపాల్‌ను లెగ్‌బ్రేక్‌తో ఔట్‌ చేసిన తీరు వార్న్‌ పేరు చెప్పగానే ఇప్పటికీ అభిమానుల కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది.

x వార్న్‌ 1992లో ఇండియా మీద తొలి టెస్టు ఆడాడు. 2007లో ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టుతో అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక తొలి వన్డే 1993లో న్యూజిల్యాండ్‌ మీద ఆడగా, 2005లో ఆసియా ఎలెవన్‌ మీద చివరి వన్డే ఆడాడు.

x మొత్తం 145 టెస్టులు ఆడి 708 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (800 వికెట్లు) తరువాత టెస్టులలో అత్యధిక వికెట్లు తీసింది ఇతనే. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను 37 సార్లు తీశాడు. ఒక మ్యాచ్‌ లో పది వికెట్లు పది సార్లు పడగొట్టాడు.
x వన్డేలలో 194 మ్యాచ్‌లు ఆడి 293 వికెట్లు పడగొట్టాడు. వన్డేలలో 14వ స్థానంలో నిలిచాడు. వన్డేలలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ఒకసారి పడగొట్టాడు.
x టి20లో 73 మ్యాచ్‌లు ఆడి 70 వికెట్లు పడగొట్టాడు.
x ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 301 మ్యాచ్‌లు ఆడి 1,319 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియా ఏ టీమ్‌కు 311 మ్యాచ్‌లు ఆడగా, 473 వికెట్లు పడగొట్టాడు.

x అడపాదడపా బ్యాటింగ్‌లో సైతం రాణించాడు. టెస్టులలో 3 వేల 154 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 99 పరుగులు. 12 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో 1,018 పరుగులు చేయగా 55 అత్యధిక పరుగులు. కేవలం ఒక అర్థ సెంచరీ మాత్రమే చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 6 వేల 919 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 107. రెండు సెంచరీలు, 26 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Show comments