జాకబ్ ఓరమ్.. ఆస్ట్రేలియాని చీల్చి చెండాడిన ఓ మగాడి కథ!

ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసిస్తున్న కాలంలో.. ఆ జట్టును వణికించిన ఒకే ఒక్క మగాడు జాకబ్‌ ఓరమ్‌. ఒక్క న్యూజిలాండ్‌కే కాదు.. మొత్తం క్రికెట్‌ ప్రపంచానికి ఓరమ్‌ అంటే ఒక హీరో. ఆస్ట్రేలియాకి అతనంటే వణుకు. అలాంటి ఆటగాడి గురించి.. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు తెలియజెప్పే ఒక ప్రయత్నమే ఈ ఆర్టికల్‌..

ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసిస్తున్న కాలంలో.. ఆ జట్టును వణికించిన ఒకే ఒక్క మగాడు జాకబ్‌ ఓరమ్‌. ఒక్క న్యూజిలాండ్‌కే కాదు.. మొత్తం క్రికెట్‌ ప్రపంచానికి ఓరమ్‌ అంటే ఒక హీరో. ఆస్ట్రేలియాకి అతనంటే వణుకు. అలాంటి ఆటగాడి గురించి.. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు తెలియజెప్పే ఒక ప్రయత్నమే ఈ ఆర్టికల్‌..

ఒక ఆటగాడ్ని వందేళ్లు గుర్తుపెట్టుకోవడానికి.. అతను వంద మ్యాచ్‌ లు ఆడాల్సిన అవసరం లేదు. ఒక్క గొప్ప ఇన్నింగ్స్‌ చాలు. అతను కొట్టిన సిక్సులు, చేసిన విధ్వంసమే అతన్ని వందేళ్లు బతికిస్తాయి. క్రికెట్‌​ అభిమానుల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు.. ఒక పవర్‌.. అతనే జాకబ్‌ ఓరమ్‌. విక్రమార్కుడు సినిమాలో ఎలివేషన్‌ డైలాగ్‌ లా ఉన్నా.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ జాకబ్‌ ఓరమ్‌ కు ఈ డైలాగ్‌ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. అతను ఆడిన ఆట అలాంటిది. క్రికెట్‌ ప్రపంచాన్ని ఒంటి చేత్తో ఏలుతున్న జట్టుపై ఎదురుదాడి చేసి.. కొన్నేళ్ల పాటు ప్రపంచాన్ని భయపెట్టిన జట్టుకు వణుకు పుట్టించాడు. అందుకే చాలా మంది క్రికెట్‌ అభిమానులకు ఓరమ్‌ అంటే ఒక ధైర్యం, ఒక తెగువ. ఇంతకీ జాకబ్‌ ఓరమ్‌ భయపెట్టింది ఎవర్నో తెలుసా? ఆస్ట్రేలియాని.

అది ప్రపంచ క్రికెట్‌ ను ఆస్ట్రేలియా శాసిస్తున్న కాలం. 1999, 2003, 2007 వరుసగా మూడు సార్లు ప్రపంచ కప్‌ గెలిచి.. క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త ఘనత కలిగిన జట్టు ఆస్డ్రేలియా. అలాంటి టైమ్‌ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటేనే అన్ని జట్లు భయపడేవి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లోనూ.. ఆస్ట్రేలియాను ఢీకొట్టే జట్టు లేదు. చిన్న జట్లు అయితే.. ఆసీస్‌ తో మ్యాచ్‌ అంటే గెలవడం అటుంచి.. కనీసం గాయాల బారిన పడకుండా ఉంటే చాలు అనుకునేవి. అంతలా ప్రపంచ క్రికెట్‌ ను కంగారులు డామినేట్‌ చేశారు. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌ గెలిచినా.. ఒకప్పటి ఆస్ట్రేలియా అంటే ఉండే భయం ఇప్పుడు లేదు. కానీ, ముఖ్యంగా.. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా అంటే ఒక విధ్వంసం. ఇలా అందరినీ భయపెడుతున్న ఆస్ట్రేలియాను.. ఒక్కడు.. ఒకే ఒక్కడు వణికించాడు.

అన్ని టీమ్స్‌ కు ఆస్ట్రేలియా అంటే భయం.. కానీ, ఆసీస్‌ కు అతనంటే భయం. ఇంతలా చెప్పేందుకు అసలు ఈ జాకబ్‌ ఓరమ్‌ ఏం చేశాడని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. అది 2007 జనవరి 28. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 343 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మ్యాథ్యూ హేడెన్‌, కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సెంచరీలతో చెలరేగారు. ఆ రోజుల్లో 300పైగా స్కోర్‌ ను ఛేజ్‌ చేయడం అంటే కష్టం.. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్‌ టీమ్‌ పై 344 పరుగులను ఛేజ్‌ చేయడమంటే.. దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గ్లెన్‌ మెక్‌ గ్రాత్‌, బ్రెట్‌ లీ, నాథన్‌ బ్రాకెన్‌, మిచెల్‌ జాన్సన్‌ లాంటి భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌ ను ఎదుర్కొని 344 పరుగులు చేయొచ్చని.. న్యూజిలాండ్‌ కూడా అనుకోని ఉండదు. కనీసం ఆస్ట్రేలియాకు పోటీ ఇచ్చి.. ఓ 250 ప్లస్‌ పరుగులు చేస్తే చాలనుకుని ఉంటారు. అంతా అనుకున్నట్లే.. న్యూజిలాండ్‌ వికెట్లు పటపటా పడ్డాయి.

150 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.. ఆ టైమ్‌ లో బ్యాటింగ్‌ కు వచ్చాడు జాకబ్‌ ఓరమ్‌. 4 వికెట్లు తీసి.. రెట్టించిన ఉత్సాహంతో నిప్పులు చిమ్ముతున్న ఆస్ట్రేలియా బౌలింగ్‌ పై మెరుపు దాడితో విరుచుకుపడ్డాడు. ఆకాశాన్ని నల్లమబ్బు కమ్మేసినట్లు.. ఆస్ట్రేలియాను నల్లజెర్సీతో కమ్మేశాడు. బ్రెట్‌ లీనా, జాన్సనా ఇంకొకళ్లా అని కాదు.. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నా.. చీల్చి చెండాడాడు. విధ్వంసకర బ్యాటర్‌ అని చెప్పుకునే.. బ్రాండెన్‌ మెక్‌కల్లామ్‌ అప్పట్లో.. నాన్‌ స్ట్రైకర్‌ వైపు నిల్చొని.. ఓరమ్‌ ఊచకోతను చూస్తున్నాడు. అప్పటి వరకు మ్యాచ్‌ తమ చేతుల్లో ఉందనుకున్న ఆస్ట్రేలియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు.. అసలు ఏం జరుగుతుందో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అర్థం కాలేదు. కేవలం 72 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేసి.. నాటౌట్‌ గా నిలిచాడు. 27.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. కేవలం 150 పరుగులు చేసిన కివీస్‌.. ఓరమ్‌ థండర్‌ ఇన్నింగ్స్‌ తో.. 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 335 పరుగులు.. చేసి విజయానికి 9 పరుగుల దూరంలో ఆగిపోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మ్యాచ్‌ గెలిచింది కానీ, హీరో అయింది మాత్రం జాకబ్‌ ఓరమ్‌.

అప్పటి వరకు అన్ని జట్లను ఓడించి, వణికించిన ఆస్ట్రేలియాను.. ఫస్ట్‌ జాకబ్‌ ఓవర్‌ భయపెట్టాడు. ఆ భయం ఆస్ట్రేలియాను చాలా కాలం వెంటాడింది. ఆ మ్యాచ్‌ తో వచ్చిన కాన్ఫిడెన్స్‌ తో ఆస్ట్రేలియాతో ఎప్పుడూ మ్యాచ్‌ ఆడినా.. జాకబ్‌ ఓరమ్ రెచ్చిపోయేవాడు. బ్యాట్‌ తో లేదా బాల్‌ తో ఏదో ఒక విధంగా ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించేవాడు. ఒక దశలో న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌ అంటే.. జాకబ్‌ ఓరమ్‌ టీమ్‌ లో ఉన్నాడా? లేడా అని కంగారు పడేది కంగారూ టీమ్. గాయాలతో ఎక్కువగా ఇబ్బంది పడిన ఓరమ్‌.. ఎప్పుడు టీమ్‌ లో ఉంటాడో.. ఎప్పుడు ఉండడో తెలిసేది కాదు. అందుకే.. ఓరమ్‌ మ్యాచ్‌ ఆడటం లేదని తెలిస్తే.. ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకునేది. అలా.. అప్పట్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ లు.. ఆస్ట్రేలియా వర్సెస్‌ జాకబ్‌ ఓరమ్‌ గా ఉండేవి. అతనో అద్బుతమైన క్రికెటర్‌ అయ్యేందుకు ఇది మాత్రమే కాదు.. ఆటపై అతనికున్న అంకితభావం కూడా కారణం.

2007 వన్డే వరల్డ్‌ కప్‌ కంటే ముందు.. జాకబ్‌ ఓరమ్‌ రింగ్‌ ఫింగర్‌ కు గాయమైంది. దాంతో అతను వరల్డ్‌ కప్‌ ఆడతాడా? లేదా అనే అనుమానాలు తలెత్తాయి. వరల్డ్‌ కప్‌ కంటే ముందు ఓ ప్రెస్‌మీట్‌ లో పాల్గొన్న ఓరమ్‌.. తన గాయం గురించి మాట్లాడుతూ.. వరల్డ్‌ కప్‌ లో ఆడేందుకు అవసరమైతే.. తన వేలును నరుక్కుంటానని అన్నాడు. ఓ ఆటగాడిగా తన జట్టు తరఫున వరల్డ్‌ కప్‌ ఆడాలని అతని కసి కనిపించింది. మొత్తానికి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన ఓరమ్‌.. అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ ను సెమీస్‌ వరకు చేర్చాడు. అయితే.. గాయాల కారణంగా.. ఓరమ్‌ కెరీర్‌ చాలా త్వరగా ముగిసింది. తరుచు గాయపడుతుండటం ఓరమ్‌ కు పెద్ద ఇబ్బందిగా మారింది. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌ లో ఎంట్రీ ఇచ్చిన జాకబ్‌.. 2021లో చివరి మ్యాచ్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తం.. 33 టెస్టులు, 160 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌ లు ఆడాడు. టెస్టుల్లో 1780 పరుగులు, 60 వికెట్లు, వన్డేల్లో 2434 రన్స్‌, 173 వికెట్లు, టీ20ల్లో 474 పరుగులు, 19 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు, వన్డేల్లో ఒక సెంచరీ, 13 హాఫ్‌ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మరి క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలోనే ఆస్ట్రేలియాను వణికించిన జాకబ్‌ ఓరమ్‌ క్రికెట్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments