ఫైనల్లో ఓడినా టీమిండియానే గ్రేట్‌! ఎందుకంటే?

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతుల్లో ఘోర ఓటమిని చవిచూసింది. పాక్‌పై ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే కానీ, ఫైనల్‌ ఓటమిని పక్కనపెడితే ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ఫైనల్లో గెలిచిన పాక్‌ జట్టును లీగ్‌ దశలోనే మట్టికరిపించారు. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌ వరకు వచ్చారు. ఇవన్నీ కాకుండా టీమిండియా కుర్రాళ్లకు ఈ సమయంలో మద్దతుగా నిలిచేందుకు మరికొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.. అవి తెలుసుకుంటే ఎవరైనా సరే, ఓడినా టీమిండియానే ఛాంపియన్‌ అని అనకమానరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ అనుభవం లేకపోయినా..
ఈ టోర్నీలో టీమిండియా-ఏ జట్టు మొత్తం 20 ఏళ్ల కుర్రాళ్లతోనే బరిలోకి దిగింది. వారిలో ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన అనుభవం లేదు. నేరుగా ఒక బిగ్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగారు. కానీ ప్రత్యర్థి జట్లలో చాలా మంది క్రికెటర్లకు బోలెడంతా అంతర్జాతీయ అనుభవం ఉంది. కొంతమంది అయితే 30 ఏళ్ల వయసుతో కెరీర్‌ చివరి దశకు వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఫైనల్‌ ఆడిన పాక్‌ టీమ్‌లోని సభ్యులకు 81 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం(అందరివి కలుపుకుని)పైగా అందులో చాలా మంది యంగ్‌ క్రికెటర్లు కాదు.

ఒత్తిడి..
ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ అనుభవం కూడా లేని టీమ్‌తో బరిలోకి దిగిన యంగ్‌ టీమిండియా టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడింది. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌ చేరింది. పాకిస్థాన్‌ను సైతం లీగ్‌ దశలో చిత్తుగా ఓడించింది. దీంతో ఈ టీమ్‌ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా మ్యాచ్‌లను కూడా పెద్ద సంఖ్యలో చూస్తుండటంతో వారిపై కాస్త ఒత్తిడి పెరిగింది. దేశం మొత్తం మన ఆటను చూస్తోంది బాగా ఆడాలనే ప్రెజర్‌ ఆటగాళ్లపై పడింది. పైగా పాకిస్థాన్‌తో ఫైనల్‌ అనే సరికి చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపించడంతో ఫైనల్‌పై హైప్‌ పెరిగి, అది భారత కుర్రాళ్లపై ఒత్తిడి పెంచింది. ఇంత ఒత్తిడిలో గతంలో మ్యాచ్‌ ఆడిన అనుభవం లేకపోవడంతో టీమ్‌ బౌలింగ్‌లో చేతులు ఎత్తేసింది. కానీ, పాక్‌ పరిస్థితి అలా కాదు, పాక్‌ సీనియర్‌ టీమ్‌ కెప్టెన్‌ మ్యాచ్‌కు ముందు వారితో మాట్లాడి ఒత్తిడి తగ్గించాడు, అలాగే అందులో చాలా మందికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో మన ఆటగాళ్లు ఫీలైనంత ప్రెజర్‌ను వాళ్లు ఫీల్‌ కాలేదు.

అంపైర్‌ తప్పిదాలు..
ఫైనల్‌ మ్యాచ్‌లో ఘోరమైన అంపైర్‌ తప్పిదాలు చోటు చేసుకున్నాయి. పాక్‌ బౌలర్‌ వేసిన నో బాల్‌ను అంపైర్లు పసిగట్టలేకపోయారు. థర్డ్‌ అంపైర్‌ సైతం నో బాల్‌ను సరైన బాల్‌గా పరిగణించడంతో టీమిండియాకు నష్టం చేసింది. అలాగే నికిన్‌ జోస్‌ సైతం అంపైర్‌ తప్పుడు నిర్ణయం కారణంగానే అవుట్‌ అయ్యాడనే ఆరోపణలు వస్తున్నాయి. బ్యాట్‌కు బాల్‌ తగలకున్నా.. అంపైర్‌ అవుట్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. అలాగే పాక్‌ ఓపెనర్‌ను టీమిండియా బౌలర్‌ అవుట్‌ చేసిన అది నో బాల్‌ కావడం కూడా భారత్‌ ఓటమికి కారణంగా మారింది. ఇలా ఏ విధంగా చూసిన ఈ ఫైనల్‌లో టీమిండియాకు అన్ని వ్యతిరేకంగానే జరిగాయి. అందుకే ఫైనల్లో టీమిండియా ఓడినా కూడా వాళ్లే ఛాంపియన్లు అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. భారత కుర్రాళ్లకు సోషల్‌ మీడియాలో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అండగా నిలుస్తూ.. ‘వి ఆర్‌ విత్‌ యూ ఛాంప్స్‌’ అంటూ మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత కెప్టెన్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ! 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా..

Show comments