భారత్, పాకిస్థాన్ జట్లు దాదాపు ఏడాది తర్వాత తలపడనున్నాయి. ఆసియా కప్-2023లో భాగంగా జరిగే గ్రూప్ మ్యాచ్‌లో దాయాది జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చూడటానికి రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు గెలుస్తారని తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు అక్తర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్, పాక్ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఒకవేళ పాకిస్థాన్ టాస్ గెలిస్తే భారత్‌కు తిప్పలు తప్పవని అక్తర్ హెచ్చరించాడు.
పాక్ టాస్ నెగ్గితే భారత్‌కు ముప్ప తప్పదన్న అక్తర్.. ఒకవేళ టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే వాళ్లదే పైచేయి అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అన్నింటి కంటే టాస్ చాలా కీలకమన్నాడు. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కొన్ని రోజుల కింద ఇదే స్టేడియంలో తలపడ్డాయి. అప్పుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆశించినంతగా భారీ స్కోరు చేయలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుందన్నాడు షోయబ్ అక్తర్. అలాగే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్‌లో ఒకవేళ పాకిస్థాన్ గనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగితే.. వాళ్లు భారత్‌ను చిత్తు చేస్తారు. అదే టైమ్‌లో ఇండియా గనుక టాస్ గెలిస్తే.. పాక్‌కు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, ఇక్కడ పిచ్ పూర్తిగా సెటిల్ అయినట్లు కనిపించడం లేదు. ఈ పిచ్ మీద రెండో ఇన్నింగ్స్‌లో బంతి అంత సులువుగా బ్యాట్ పైకి రావడం లేదు. ఈ మ్యాచ్‌లో పేస్ బౌలర్లు కీలకం కానున్నారు. భారత్ తప్పకుండా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి. అతడు చాలా నైపుణ్యం కలిగిన ప్లేయర్. బుమ్రా, షమీ, సిరాజ్‌లు ఎలాగూ టీమ్‌లో ఉంటారు’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: PAKతో మ్యాచ్.. కోహ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటున్న ఫ్యాన్స్!