IND vs AFG: ఆఫ్ఘాన్​తో తొలి టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20 సిరీస్​లో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం రాత్రి మొహాలీలో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ప్రత్యర్థి జట్టును 158 పరుగులకు కట్టడి చేసింది టీమిండియా. ఆ టార్గెట్​ను 17.3 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టీ20లో రోహిత్ సేన విజయం సాధించడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి బౌలింగ్. మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘాన్​ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. మంచి స్టార్ట్స్ అందుకున్న రెహ్మానుల్లా గుర్బాజ్ (23), ఇబ్రహీం జాద్రాన్ (25), అజ్మతుల్లా ఒమర్జాయి (29)లు భారీ స్కోర్లు చేయకుండా అడ్డుకున్నారు. ముకేష్​ కుమార్ (2/32), అక్షర్ పటేల్ (2/23) ఆకట్టుకున్నారు. శివమ్ దూబె (1/9) ఒక వికెట్ పడగొట్టాడు.

అర్ష్​దీప్ వికెట్ తీయకపోయినా రన్స్ ఇవ్వకుండా ఆఫ్ఘాన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. తొలి టీ20లో భారత్ విజయానికి మరో ప్రధాన కారణం బ్యాటింగ్. మోస్తరు టార్గెట్​తో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. అయితే యంగ్​స్టర్స్ శుబ్​మన్ గిల్ (12 బంతుల్లో 23), తిలక్ వర్మ (22 బంతుల్లో 26) భయపడలేదు. వరుసగా బౌండరీలు, సిక్సులు కొడుతూ ఆఫ్ఘాన్ బౌలర్లపై ప్రెజర్ పెంచారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ వెనుదిరిగినా తర్వాత వచ్చిన శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్), జితేష్​ శర్మ (20 బంతుల్లో 31), రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్) హిట్టింగ్​కు దిగడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది.

ముఖ్యంగా దూబె ఇన్నింగ్స్​ను మెచ్చుకోవాలి. రాకరాక వచ్చిన ఛాన్స్​ను పూర్తిగా వినియోగించుకున్న అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఆఖర్లో నవీన్​ ఉల్ హక్ బౌలింగ్​లో వరుసగా సిక్స్, బౌండరీ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి మూడో కారణం ఆల్​రౌండర్లు చెలరేగడం. బ్యాటింగ్ ఆల్​రౌండర్ దూబె 1 వికెట్ తీయడంతో పాటు 60 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. క్రీజులో కుదురుకున్న ఆఫ్ఘాన్​ ఓపెనర్లను వీళ్లిద్దరూ వెనక్కి పంపారు. దూబె బౌలింగ్ చేయడంతో సిక్త్ బౌలర్ లేక ఇబ్బంది పడుతున్న భారత్​కు బౌలింగ్ ఆప్షన్స్ పెరిగాయి. తనపై టీమ్ మేనేజ్​మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని సత్తా చాటాడు. ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​ను ముగించడం స్పెషల్. ఈ మ్యాచ్​లో భారత్ గెలుపునకు మరో కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ.

అక్షర్, సుందర్, దూబె రూపంలో ముగ్గురు ఆల్​రౌండర్లను ఆడించిన హిట్​మ్యాన్.. వారిని అవసరానికి తగ్గట్లు వాడుకున్నాడు. బ్రేక్ త్రూలు కావాలన్నప్పుడు వాళ్లను దించి ఫలితాలు రాబట్టాడు. ఆఫ్ఘాన్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. బ్యాటింగ్​లో కూడా దూబేను మిడిలార్డర్​లో ఆడించడంతో అతడు రన్స్​ చేయడమే గాక మ్యాచ్​ను ఫినిష్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ మ్యాచ్​లో టీమిండియా విజయానికి చివరి కారణం టాస్. మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన మొహాలీలో రాత్రిపూట తేమ ఎక్కువగా కురుస్తుంది. ఈ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలం. అందుకే టాస్ నెగ్గిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది కూడా మన టీమ్​కు కలిసొచ్చింది. మరి.. తొలి టీ20లో​ భారత్ విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: పాపం.. రోహిత్ డక్ ఔట్! తప్పు గిల్ దా? రోహిత్ దా?

Show comments