వెస్టిండీస్ పర్యటనను భారత జట్టు నిరాశగా ముగించింది. విండీస్‌తో ఆదివారం జరిగిన నిర్ణాయక ఐదో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి తర్వాత కుర్రాడు తిలక్ వర్మ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దీంతో బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై టీమిండియా భారీ స్కోరు చేయడంలో ఫెయిలైంది. కరీబియన్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ (4 వికెట్లు), అకీల్ హోసేన్ (2 వికెట్లు) భారత్‌ను కట్టడి చేశారు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. బ్రెండన్ కింగ్ (85 నాటౌట్)తో పాటు నికోలస్ పూరన్ (47) అద్భుతంగా రాణించడంతో విండీస్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిరీస్‌ను ఓడిపోవడంతో అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. గత 25 నెలల కాలంలో భారత్ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. 17 ఏళ్ల తర్వాత కరీబియన్ జట్టుపై సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. ఓ టీ20 సిరీస్‌లో మన జట్టు మూడు మ్యాచుల్లో ఓడటం కూడా ఇదే ఫస్ట్ టైమ్.
విండీస్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టుపై ఫ్యాన్స్, విమర్శకులే కాదు.. సీనియర్ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. టీమిండియా ఒక సాధారణ జట్టులా కనిపిస్తోందని భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌కూ క్వాలిఫై కాలేకపోయిన విండీస్ చేతిలో ఇండియా ఓడటం దారుణమన్నాడు. మాజీ కెప్టెన్ ధోనీలా ఒక జట్టును కొనసాగించేందుకు ప్రయత్నించాలని వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. ఒక పద్ధతి ప్రకారం ప్లేయర్లకు నిరంతరం అవకాశాలు ఇస్తూ వారిని జట్టులో ధోని కొనసాగించేవాడని గుర్తుచేశాడు.
చివరి టీ20లో ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యల మీద వెంకటేష్ ప్రసాద్ సీరియస్ అయ్యాడు. సొల్లు మాటలు చెప్పడం ఆపాలంటూ పాండ్యాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నిర్ణాయక ఐదో టీ20లో ఓటమి తర్వాత పాండ్యా చేసిన కామెంట్స్‌పై చాలా మంది మండిపడుతున్నారు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే.. ‘ఈ మ్యాచ్‌లో ఓటమి గురించి మరీ ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మా ప్లేయర్లు ఎలా ఆడారనేది మాకు తెలుసు. ఒక్కోసారి ఓటమి కూడా మనకు మంచి చేస్తుంది. ఈ ఓటమి పెద్దగా బాధ కలిగించలేదు. కఠిన పరిస్థితుల్లో ఆడాలని ఫిక్స్ అయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. ఓడిపోయినా బాధ లేదంటూ హార్దిక్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే వెంటకేష్ ప్రసాద్ పైవిధంగా స్పందించాడు.
India has been a very very ordinary limited overs side for sometime now. They have been humbled by a West Indies side that failed to qualify for the T20 WC few months back. We had also lost to Ban in the ODI series. Hope they introspect instead of making silly statements #IndvWI
— Venkatesh Prasad (@venkateshprasad) August 13, 2023