రేపట్నుంచే ఇండియా vs ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌! లైవ్‌ ఇలా చూడండి

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఓటమి తర్వాత.. టీమిండియా టీ20 పోరుకు సిద్ధమైంది. పసికూన ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఐరిష్‌ గడ్డపై అడుగుపెట్టింది. భారత సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీలో యుంగ్‌ టీమిండియా, ఐర్లాండ్‌తో ఫైట్‌కు సిద్ధమైంది. సీనియర్‌ ఆటగాళ్లకు రెస్ట్‌ ఇవ్వడంతో యువ క్రికెటర్లతో కూడిన జట్టును ఐర్లాండ్‌కు పంపింది బీసీసీఐ. అయితే.. చాలా కాలంగా జట్టు దూరంగా ఉన్న బుమ్రా.. ఈ సిరీస్‌తోనే తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ముందు ఈ సిరీస్‌ను ఓ ప్రాక్టీస్‌ సెషన్‌లా బుమ్రా ఉపయోగించుకోనున్నాడు. బుమ్రాతో పాటు యువ క్రికెటర్లు తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌, శివమ్‌ దూబే, అర్షదీప్‌ సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌, రవి బిష్ణోయ్‌, యశస్వి జైస్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి యువ క్రికెటర్లకు ఈ సిరీస్‌ ఎంతో కీలకంగా మారనుంది. ఈ టీమ్‌ నుంచి తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ భారత వన్డే జట్టులో చోటు ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెస్టిండీస్‌ సిరీస్‌లో అదరగొట్టిన తిలక్‌ వర్మ.. ఇక్కడ కూడా రాణిస్తే.. ఆసియా కప్‌ కోసం అతని ఎంపిక అనివార్యమే అవుతుంది.

కాగా.. తొలి టీ20 రేపు(18 ఆగస్ట్‌, శుక్రవారం) డబ్లిన్‌ వేదికగా జరగనుంది. అలాగే రెండో టీ20 20న, చివరిదైన మూడో టీ20 23న డబ్లిన్‌ వేదికగానే జరగనుంది. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే.. ఈ మూడు మ్యాచ్‌ సిరీస్‌ను స్పోర్ట్స్‌ 18 ఛానెల్‌తో పాటు, డీడీ స్పోర్ట్స్‌(ఫ్రీ డిష్‌)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జియో సినిమా యాప్‌లో కూడా మ్యాచ్‌ను లైవ్‌ చూడొచ్చు. దూరదర్శన్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది. మరి ఈ సిరీస్‌లో టీమిండియా విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏ జట్టునైనా ఓడిస్తాం! భారత్‌తో సిరీస్‌కి ముందు ఐర్లాండ్‌ క్రికెటర్‌ వార్నింగ్‌

Show comments