BREAKING: గుండెపోటుతో తెలుగు క్రికెటర్‌ మృతి!

క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించి, ఆటే శ్వాసగా బతికిన తెలుగు క్రికెటర్‌ గుడివాడకు చెందిన సోముదల ఈశ్వర్‌(40) గుండెపోటుతో మృతిచెందారు. ఆగస్టు 28నే ఆయన మరణించినా.. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడలోని అప్పన్నకాలనీ 68వ వార్డుకు చెందిన ఈశ్వర్‌.. జాతీయ జట్టుకు ఆడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, పేదరికం, భారీ పోటీతో ఆయన నెట్‌ బౌలర్‌గా మిగిలిపోయారు. లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన ఈశ్వర్‌.. అద్భుతమైన స్పీడ్‌తో బౌలింగ్‌ చేసేవారు. ఆయన బౌలింగ్‌ నచ్చి.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆయనను నెట్‌ బౌలర్‌గా తీసుకుంది.

ఐపీఎల్‌లో సపోర్టింగ్‌ స్టాఫ​్‌గా చేస్తూనే.. విశాఖలో ఇటీవల జరిగిన ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సీజన్‌ ముగియడంతో తన స్వగ్రామానికి వచ్చారు. ఆగస్టు 28వ తేదీన తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చిన ఈశ్వర్‌.. ఇంటి బయట బైక్‌ నిలిపి.. దాని స్టాండ్‌ వేస్తూ.. అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించేలోపు మరణించారు. ఈశ్వర్‌ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని టీమిండియా క్రికెటర్లు కేఎస్‌ భరత్‌, ఇతర క్రికెటర్లు సందర్శించి నివాళి అర్పించారు.

కాగా.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావుతో పాటు రంజీ సెలెక్షన్స్‌కు వెళ్లిన ఈశ్వర్‌ ఆ ఏడాది రంజీకి ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ, ఐపీఎల్‌తో ఆయనకు స్టార్‌ క్రికెటర్లకు బౌలింగ్‌ చేసే అవకాశం లభించింది. పైగా ఈశ్వర్‌ బౌలింగ్‌ను వార్నర్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు కూడా ఎంతో ఇష్టపడేవారు. అతని బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు ఎక్కువ మొగ్గుచూపేవారని సమాచారం. పైగా టీమ్‌లో ఈశ్వర్‌ను 12వ ఆటగాడిగా ట్రీట్‌ చేస్తూ.. చాలా బాగా చూసుకునేవారు. అయితే.. కేవలం 40 ఏళ్ల వయసులోనే ఈశ్వర్‌ కన్నుమూయడంతో ఆంధ్రా క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చదవండి: కోహ్లీలా ఆడే మొనగాడు ఈ ప్రపంచంలోనే మరొకడు లేడు: పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

Show comments