ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి. కటౌట్ చిన్నదే అయినా కంటెంట్ లో మాత్రం దుమ్ము లేపుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ బాటలోనే జితేందర్ రెడ్డి మూవీ వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుం? లేదా? అనేది తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి. కటౌట్ చిన్నదే అయినా కంటెంట్ లో మాత్రం దుమ్ము లేపుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ బాటలోనే జితేందర్ రెడ్డి మూవీ వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుం? లేదా? అనేది తెలుసుకుందాం.
Raj Mohan Reddy
టాలీవుడ్ కళకళలాడిపోతోంది. కొత్త కథలు, కొత్త కథనాలతో మంచి సినిమాలు వస్తున్నాయి. “క, లక్కీ భాస్కర్, అమరన్” సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓ సిన్సియర్ ఎఫర్ట్ తో జితేందర్ రెడ్డి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది పొలిటికల్ స్వయంసేవకుడి బయోపిక్. ఎన్నో కాంట్రవర్సీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన జితేందర్ రెడ్డి బయోపిక్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
1980 నుండి 1990 మధ్య కాలంలో తెలంగాణ భూభాగాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు నక్సలైట్లు. సామాజిక వ్యవస్థల పట్ల నమ్మకం లేని వీరి విధానాలను వ్యతిరేకించిన వ్యక్తి జితేందర్ రెడ్డి ( రాకేష్ వర్రే) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల కుటుంబంలో జన్మిస్తాడు జితేందర్. ఓ ఎన్కౌంటర్ కారణంగా జితేందర్ రెడ్డి నక్సలైట్స్ పై పోరాటం చేయాలని నిర్ణయించుకుంటాడు. విద్యార్థి దశ నుంచి జాతీయవాదిగా అడుగులు వేస్తాడు. ఆ క్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలని ఎదిరిస్తాడు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో.. యువతలో లెఫ్టిస్ట్ లు పట్టు కోల్పోతారు. దీంతో.. లాయర్ రాజగోపాల్ ప్రోద్బలంతో నక్సలైట్స్ కి జితేందర్ రెడ్డి టార్గెట్ గా మారతాడు. ఇక్కడ నుండి జితేందర్ రెడ్డి.. నక్సల్స్ ని ఎలా ఎదిరించాడు? ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగాడు? చివరికి నక్సల్స్ చేతిలో ఎలా చంపబడ్డాడు అన్నది ఈ చిత్ర కథ.
కోటి రత్నాల వీణ నా తెలంగాణ అని దాశరథి కృష్ణమాచార్య అన్న మాట ఎంతటి వాస్తవమో.. ఈ పుణ్యభూమిలో అన్ని కష్టాలను ఓర్చుకొని, తట్టుకొని నిలబడ్డారు అన్నది అంతే వాస్తవం. ఇక్కడి ప్రజలు నిజాంకి, దొరలకి, రజాకార్లకు ఎంతగా భయపడ్డారో.. నాయకులకి, పోలీసులకి, ఆఖరికి అన్నలకి కూడా అంతే స్థాయిలో భయపడుతూ బతికారు. జితేందర్ రెడ్డి సినిమాలో మనం ఇదే చూడొచ్చు. ఇప్పటి వరకు వెండితెరపై చూపించని కోణం ఇది. ఊరికి బస్సు వస్తే అభివృద్దా.. ఉన్న బస్సులను తగలబెడితే అభివృద్దా? కొత్త రోడ్లు వేస్తే అభివృద్దా.. ఉన్న రోడ్లను పగలకొడితే అభివృద్దా? విద్వేషాలు ఉసిగొల్పడం అభివృద్దా..ఐక్యంగా ఉండటం అభివృద్దా? వంటి ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి. మిగతా అన్ని సినిమాల కన్నా, జితేందర్ రెడ్డి మూవీని ప్రత్యేకంగా నిలిపింది కూడా ఈ బోల్డ్ అటెంప్టే.
జితేందర్ చిన్నతనంలోనే దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించేవాడు. ఈ విషయాన్ని బాగా రిజిస్టర్ చేయడానికి.. అతని కుటుంబ నేపధ్యాన్ని, స్వయం సేవక్ మీటింగ్స్ ని దర్శకుడు బాగా చూపించాడు. కాకపోతే.. ఆ వయసులో జితేందర్ రెడ్డి క్యారెక్టర్ ని పూర్తిగా మార్చేది మాత్రం ఓ యవకుడి ఎన్కౌంటర్. ఆ సీక్వెన్స్ అంతా బాగా పండటంతో.. జితేందర్ క్యారెక్టర్ కి అంతగా ఎస్టాబ్లిష్ మెంట్ అవసరం లేకుండా పోయింది. దీంతో దర్శకుడు నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు. ఒకవైపు జితేందర్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగే విధానాన్ని బాగా చూపిస్తూనే.. నక్సల్స్ కి అతను ఎలా టార్గెట్ గా మారుతున్నాడో రిజిస్టర్ చేస్తూ వచ్చాడు. ఇక కాలేజీ ఎన్నికల సీక్వెన్స్ మాత్రం అంత బాగా చూపించలేదు. కాకపోతే.. వామపక్ష విద్యార్థులు జితేందర్ పై దాడి చేయడం, అక్కడ జితేందర్ రెడ్డి తొలిసారి ఓ హత్య చేయాల్సి రావడం మాత్రం చాలా రియలిస్టిక్ గా చూపించారు. దీనికి తోడు.. గోపన్న హత్య సినిమాకి ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చి పెట్టింది. దీంతో ఫస్ట్ బాగానే ముగించారు అనే ఫీల్ కలుగుతుంది.
జితేందర్ రెడ్డి సెకండ్ ఆఫ్ అంతా అతని రైజ్ గా చెప్పుకోవచ్చు. గోపన్న పోయాక ప్రజలకి అతను అండగా మారే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలో వాజ్ పేయ్ రిఫెరెన్స్ తో సాగే సీక్వెన్స్ బాగా వచ్చింది. ఇక అక్కడ నుంచి జితేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం, నక్సల్స్ తో వార్ సాగించడం, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని కలిసి.. నక్సల్స్ హీరోలు కాదు సార్ అని దైర్యంగా చెప్పడం వంటి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక చివరగా జితేందర్ రెడ్డిని నక్సల్స్ కాల్చి చంపే సన్నివేశాలు కూడా వీరోచితంగా ఉండటంతో క్లైమాక్స్ కూడా బాగానే వచ్చింది. దీంతో జితేందర్ రెడ్డి మంచి మూవీగానే అనిపిస్తుంది. కాకపోతే.. ఇక్కడ ఓ లిమిటేషన్ ఉంది. జాతీయవాదులకి మాత్రమే ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. వామపక్షాల వారికి, నక్సల్స్ సానుభూతి పరులకి ఈ మూవీ అంతగా రుచించకపోవచ్చు.
రాకేష్ వర్రే “జితేందర్ రెడ్డి” పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా జాతీయవాదిగా యాక్షన్ సీక్వెన్స్ ల్లో అదరగొట్టేశాడు. అతని ఫిజిక్ కూడా ఈ క్యారెక్టర్ కి మంచి అసెట్ అయ్యింది. సుబ్బరాజు, ఛత్రపతి శేఖర్ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. చాలా కాలం తర్వాత వీరికి గుర్తుండిపోయే పాత్రలు పడ్డట్టే. హీరోయిన్ రియా సుమన్ క్యారెక్టర్ కి అంతగా ప్రాముఖ్యత లేదు. వి.ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. గోపీసుందర్ మ్యూజిక్ లో మెరుపులు లేవు. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. దర్శకుడు విరించి వర్మ ఓ మంచి సినిమాలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా చాలా చోట్ల డబ్బింగ్ అసలు సింక్ కాలేదు. ఇలాంటి కొన్ని విషయాలు తప్పితే దర్శకుడు విరించి వర్మ మాత్రం పాస్ అయినట్టే.
రేటింగ్ : 3/5