ఉక్రెయిన్ అణువిద్యుత్ ప్లాంట్‌ మీద రష్యా దాడి.. పేలితే మారణహోమమే?

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి 9వ రోజుకు చేరింది. అయితే ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారుతోంది. శక్తివంతమైన రష్యా ఉక్రెయిన్‌ను నాశనం చేయడంలో నిమగ్నమై ఉంది. అయితే ఇరు దేశాలకు ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కాగా, ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ఒబ్లాస్ట్ ప్రావిన్స్‌లోని ఎనర్‌హోదర్ నగరం మీద రష్యా భారీ దాడిని ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైనికులు దాడి చేశారని, అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారని అంటున్నారు. ఈ కాల్పులతో అణు విద్యుత్ ప్లాంట్ అగ్నికి ఆహుతైనట్టు చెబుతున్నారు.

దాడి అనంతరం అణు విద్యుత్ కేంద్రం నుంచి పొగలు వచ్చినట్టు ఎనర్‌గోదర్ నగర మేయర్ చెప్పారు. అగ్నిప్రమాదం తర్వాత యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడులను విరమించుకోవాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా దళాలకు పిలుపునిచ్చారు. “ఇది పేలితే చెర్నోబిల్ కంటే 10 రెట్లు పెద్ద పేలుడు అవుతుంది, రష్యన్లు వెంటనే దాడులు ఆపాలి” అని కులేబా ట్వీట్ చేశారు. ప్లాంట్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని, ట్యాంకులతో పట్టణంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో 6 రియాక్టర్లు ఉన్నాయి, ఇది యూరప్‌లో అతిపెద్దది కాగా మొత్తం ప్రపంచంలో 9వ అతిపెద్దది.

మీడియా నివేదికల ప్రకారం, రష్యా ప్రస్తుతం మోర్టార్లు సహా RPGలతో దాడి చేస్తోంది. ఎనర్జీ సెంటర్‌లోని కొన్ని భాగాలు ప్రస్తుతం మంటల్లో ఉన్నాయి. రష్యన్లు అక్కడ అగ్నిమాపక సిబ్బందిపై కూడా కాల్పులు జరిపారని అంటున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టినప్పటి నుంచి ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. అంతకుముందు, చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌ను సైతం ఫిబ్రవరిలోనే రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్నాయని, బయటి వ్యక్తి జోక్యం చేసుకుంటే గతంలో ఎన్నడూలేని పరిణామాలు ఉంటాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు.

Show comments