చెప్ప‌క‌నే చెప్పిన ప‌వ‌న్

విప‌క్షం అంతా ఒక‌టే.. వారి ల‌క్ష్యం ఒక‌టే.. ఏపీ స‌ర్కారుపై బుద‌రజ‌ల్ల‌డం.. నేరం కేంద్రానిదైనా రాష్ట్రాన్నే నిందించ‌డం. కొంత‌కాలంగా ఏపీ రాజ‌కీయాల్లో ఇదే చోటుచేసుకుంటోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు పార్టీలుగా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్రాన్ని కానీ, బీజేపీని కానీ నిందించే, ప్ర‌శ్నించే సాహ‌సం జ‌న‌సేనాని చేయ‌లేక‌ పోతున్నారు.అయితే..వారి పొత్తుతో సంబంధంలేని తెలుగుదేశం కూడా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌కపోగా.. జ‌గ‌న్ నే విమ‌ర్శిస్తోంది టీడీపీ. ఈ క్ర‌మంలో టీడీపీ కూడా జ‌న‌సేన‌, బీజేపీతో జ‌త‌క‌లుస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు అయితే.. ప‌వ‌న్ పై త‌న మ‌నుసులోని ప్రేమ‌ను బ‌హిరంగంగానే వ్య‌క్త‌ప‌రిచారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్ 2024లో జ‌రిగే ఎన్నిక‌ల ముఖ‌చిత్రాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై కేంద్రంతో పాటు, టీడీపీని కూడా ప్ర‌శ్నించామ‌ని చెప్పిన ప‌వ‌నే మ‌రో ప్ర‌క‌ట‌న కూడా చేశారు. 2024లో స‌రికొత్త ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌న్న ఆయ‌న ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌నివ్వ‌బోమ‌ని చెప్పారు. గ‌మ‌నిస్తే అందులోనే ప‌వ‌న్ అంత‌రార్థం అర్థం చేసుకోవ‌చ్చు. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన విడివిడిగా పోటీచేసేది లేద‌ని, కూట‌మి ఖాయ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు. తనకు బీజేపీ నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురుచూస్తానని చెప్పారు.

1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు ఎలా కలిసి పనిచేశాయో…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ బాగుకోసం వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. రాజకీయ పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ముందుకొస్తే అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. తాను నలుగురికి ఇచ్చేవాడేనని, అడిగేవాడిని కాదన్నారు. పదిమందికి పెట్టేవాడినే తప్ప దోచుకునేవాడిని కాదని, అందరూ బాగుంటే చాలనుకుంటున్నానని చెప్పారు.

’’ ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు అధికారం కోసంకాదు …పుట్టబోయే బిడ్డలకోసం. ఎదుగుతున్న తరంకోసం ఆలోచిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబతున్నా…రాష్ట్ర బాధ్యతను పవన్‌ కళ్యాణ్‌, జనసేన తీసుకుంటుంది. భవిష్యత్‌ ఎజెండాను మోయడం కంటే బాధ్యతేముంటుంది…ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది’’ అని విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ క్ర‌మంలో మున్ముందు ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

Show comments