iDreamPost
iDreamPost
ఒడిశా రాష్ట్రంలో జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) జోరుతో బీజేపీ, కాంగ్రెస్ బేజారెత్తిపోతున్నాయి. ఈ నెల 16 నుంచి 24 వరకు ఐదు దశల్లో 841 జిల్లాపరిషత్ స్థానాలతో పాటు 1669 సర్పంచ్, 1669 సమితి సభ్యులు, 22,379 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిషత్ స్థానాల ఓట్ల లెక్కింపు దశలవారీగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. శనివారం 315 స్థానాల్లో లెక్కింపు పూర్తి కాగా ఆదివారం మరో 307 సీట్లకు లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు, అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతోంది. దాదాపు 87 శాతం జిల్లా పరిషత్ స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరుతున్నాయి.
దరిదాపుల్లో లేని బీజేపీ, కాంగ్రెస్
మొదటి దశ కౌంటింగులో శనివారం 315 జెడ్పీ స్థానాల ఫలితాల్లో 277 సీట్లు బీజేడీ కైవశం కాగా బీజేపీ 18, కాంగ్రెస్ 16 స్థానాల్లోనే విజయం సాధించాయి. రెండో రోజు ఆదివారం 307 జెడ్పీ సీట్ల కౌంటింగ్ జరుగుతోంది. ఈ దశలోనూ బీజేడీ జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజా ఫలితాల సరళి ప్రకారం ఆ పార్టీ 255 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తోంది. బీజేపీ 19, కాంగ్రెస్ 12 చోట్ల ఆధిక్యంలో ఉండగా ఐదు చోట్ల అగ్రస్థానంలో ఉన్నారు. రెండు రోజుల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం కౌంటింగ్ జరిగిన 622 స్థానాల్లో బీజేడీకి 532 సీట్లు లభిస్తుండగా బీజేపీ 37, కాంగ్రెస్ 30 సీట్లతో సరిపెట్టుకోక తప్పలేదు.
తుది ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్?
మిగిలిన 229 జెడ్పీ స్థానాలతోపాటు సర్పంచ్, సమితి, వార్డు సభ్యుల ఓట్లలెక్కింపు సోమవారం నిర్వహించనున్నారు. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే.. వాటిలోని బీజేడీ ఏకపక్ష విజయాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. 2017 స్థానిక ఎన్నికల్లో మొత్తం 476 జెడ్పీ సీట్లలోనే గెలిచిన అధికార పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో ఇంకా 229 స్థానాల్లో లెక్కింపు ప్రారంభం కాకముందే గత ఫలితాలను అధిగమించి 532 స్థానాల్లో గెలవడం విశేషం. కౌంటింగ్ మొత్తం పూర్తి అయ్యేసరికి బీజేడీ స్కోర్ 700 సీట్లు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాలకు గాను 10 జిల్లాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో మయూర్బంజ్, కలాహాండి, మల్కన్ గిరి జిల్లాల్లో గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం చతికిల పడింది.