జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ మ‌రో లేఖ‌.. విష‌యం ఏంటంటే..

ప్ర‌భుత్వాల‌కు, నేత‌ల‌కు లేఖ‌లు రాయ‌డంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ముందువ‌రుస‌లో ఉంటారు. త‌ర‌చూ ఏదో అంశంపై స్పందిస్తూ ఉంటారు. ప‌లు స‌మ‌స్య‌ల‌ను, సూచ‌న‌ల‌ను లేఖ‌ల్లో పేర్కొంటారు.
కాపు సామాజికవ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. ఆయన చిత్తశుద్ధి కమిట్మెంట్ గురించి కూడా అంతా గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆయన కాపు ఉద్యమం నుంచి దూర‌మైన త‌ర్వాత కొంతకాలం నిశ్శ‌బ్దంగా ఉన్నారు. ఏడాదికాలంగా మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారో లేదో తెలియదు కానీ.. స‌మ‌కాలీన అంశాల‌పై అప్పుడ‌ప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి మ‌రో లేఖ రాశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ వరుసబెట్టి లేఖలు మాత్రమే రాస్తూ వస్తున్నారు. అవి కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే కావడం విశేషం. లేటెస్ట్ గా మరో మారు ముద్రగడ రాసిన లేఖలో కోనసీమకు దివంగత స్పీకర్ బాలయోగి పేరు పెట్టాలని సూచించారు. బాలయోగి కోనసీమ ప్రగతికి ఎంతోమేలు చేశారని ఆయన ప్రజా ప్రతినిధిగా చేసిన సేవల వల్లనే ఈ రోజు కోనసీమ అభివృద్ధి చెందిందని కూడా గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి పేరును జిల్లాకు పెట్టడం మంచి పరిణామంగా చెప్పుకొచ్చారు.

అలాగే గోదావరి జిల్లాలో మరో దానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. బాబాసాహెబ్ పేరిట జిల్లా ఉండడం దార్శనికతను తెలియచేస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి తాను చెప్పినట్లుగా చేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోతారని కూడా ముద్రగడ పేర్కొన్నారు. పెద్ద మనసుతో ఆలోచించాలని కూడా సూచించడం విశేషం. రాష్ట్రంలో ఏ విధ‌మైన మార్పు జ‌రిగినా వాటిపై ముద్ర‌గ‌డ స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా కొత్త జిల్లాల‌పై కూడా ఆయ‌న ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను లేఖ ద్వారా జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.

Show comments