Tirupathi Rao
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ లో గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేశారు. అందుకు సంబధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీఓ విడుదల చేశారు.
గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ పదవీ కాలం గతనెల 20వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా రవిబాబు, పద్మశ్రీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ నామినేట్ చేసిన శాసన మండలి సభ్యుల పదవీకాలం నోటిఫికేషన్ జారీచేసిన తేదీ నుంచి ఆరేళ్లపాటు ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులలో పేర్కొన్నారు.