ఏపీ మీద కామెంట్స్.. వెనక్కు కేటీఆర్.. వివరణ

ఏపీలో పరిస్థితి ఏమంత బాలేదు అని అర్థం వచ్చేవిధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించనప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించే అని ఉండవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

తన ఫ్రెండ్ ఒకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు,నీళ్లులేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ తనకు చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది నాలుగు బస్సుల్లో పంపితే తెలంగాణలో ఎంత చక్కగా పాలన ఉందో అర్థమవుతుంది అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు. ఇందులో ఎక్కడా ఆయన ఏపీ పేరు ప్రస్తావించలేదు పక్క రాష్ట్రం అనే మాట్లాడారు. అదీకాక సంక్రాంతికి ఏపీలో అసలు పవర్ కట్స్ అనేవే లేవు. అయితే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ కామెంట్స్ అటు ఏపీ ప్రతిపక్షానికి, దానికి దన్నుగా ఉండే మీడియాకు ఆయుధంగా మారాయి.

ఇక ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు కూడా కేటీఆర్ ఏపీ గురించి అని ఉండకపోవచ్చు అని ఒకవేళ ఆయన ఇక్కడ గురించే అంటే కనుక ఆయనను ఏపీ ఆహ్వానించి అభివృద్ధి చూపిస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయం మీద రాజకీయ దుమారం రేగడంతో కేటీఆర్ స్పందించారు.ఈరోజు ఒక మీటింగ్‌లో నేను చేసిన ఒక కామెంట్ ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు, నేను ఏపీ సీఎం జగన్ గారితో గొప్ప సోదర భావాన్ని కలిగి ఉన్నాను అంటూనే ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుంది ఏమో చూడాలి మరి.

Show comments