నేనెందుకు బీజేపీలో చేరతాను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

‘జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటాను. నేనెందుకు బీజేపీలో చేరతాను’అని కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వెళ్తున్నారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతి ఇంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయని, కాంగ్రెస్‌ పార్టీలో అలాంటివి సహజమని అన్నారు. సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాలతో తనకు సంబంధం లేదన్నారు. వెంకటరెడ్డి మంగళవారం ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ తరపున ప్రజలకోసం పోరాడుతున్నానని, తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై స్పందిస్తూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లో గొడవలు లేవా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంశంపై కూడా ఆయన స్పందించారు. డబ్బులు తీసుకోకుండా పీకే పనిచేస్తారని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వెంకటరెడ్డి స్పందిస్తూ.. ‘‘పీకే ఏమైనా గాంధీ మహాత్ముడా..? ఆయన బృందంలో 500 మంది ఉంటారు. వాళ్లకు జీతాలు ఇంటిలోంచి తీసుకొచ్చి ఇస్తాడా..?’’ అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు 95-105 సీట్లు వచ్చే పరిస్థితే ఉంటే రూ.500 కోట్లు ఇచ్చి ప్రశాంత్‌ కిషోర్‌ను ఎందుకు నియమించుకున్నట్లు అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారని, కేసీఆర్‌ ఓ 12 రోజులు ఆస్పత్రిలో ఉంటే ప్రగతి భవన్‌లో ఇద్దరు, ముగ్గురు పొడుచుకుని చనిపోతారన్నారు. తమ పార్టీలో చిన్న చిన్న సమస్యలుంటే సమసిపోతాయని పేర్కొన్నారు.

Show comments