Arjun Suravaram
Jamili Elections: గురువారం జమిలీ ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి. ఇది జరగడం సాధ్యమా?, అసాధ్యమా?. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jamili Elections: గురువారం జమిలీ ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి. ఇది జరగడం సాధ్యమా?, అసాధ్యమా?. ఆ వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పాలసీని తెచ్చేందుకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఓ కీలక అడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై…ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలిదశలో పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన వంద రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకూ ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. అయితే గతంలోనూ ఒకేసారి జరిగినప్పటికీ.. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి వ్యవస్థ మాయమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే… కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో… మరికొన్నింటికి తగ్గించడమో చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా చాలానే అవరోధాలున్నాయి.
దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు అన్ని ఎన్నికలూ ఏకకాలంలో నిర్వహించారు. ఆ తర్వాత ఇందులో మార్పులు జరిగాయి. అసెంబ్లీలు, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్ స్పష్టం చేసింది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది. ఆ అంశానికి దేశవ్యాప్తంగా విస్తృతంగా మద్దతు లభించింది. కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా నివేదికలోని సిఫార్సులను ఆమోదించింది. రాజకీయపార్టీల్లో అత్యధికం ఈ విధానానికి మద్దతు పలికినట్లు సమాచారం.
కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలిని సాధ్యం చేయాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందున్న అనేక సవాళ్లున్నాయి. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం దేశవ్యాప్త చర్చల ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ విధాన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన కసరత్తును పూర్తిచేయడానికి ఒక బృందాన్ని నియమించబోతున్నారు. సంప్రదింపులు ముగిశాక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు.
రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా ఆ మార్కు దాటాలంటే సొంతబలగంతోపాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. జమిలి ఆమోదానికి లోక్ సభలో 362 మంది మద్దతు కావాలి. అలానే రాజ్యసభలో 164 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకూ విలువ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని కూడా జమిలి ఎన్నికలకు ఒప్పించాలి. అందుకే పార్లమెంటుతోపాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఒకే చెప్పాలి. అంటే 14కుపైగా రాష్ట్రాలు జమిలికి అంగీకరించాలి.
ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లోఅధికారంలో ఉంది. అలా సుదీర్ఘ ప్రక్రియ తర్వాత… 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ తెలిపింది. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమనీ, దీనిని అంగీకరించబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ఇలాంటి వాటిని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. మరి..జమిలి ఎన్నికల విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.