టార్గెట్‌ 175.. త్వరలోనే రెండు సరికొత్త కార్యక్రమాలతో జనాల్లోకి సీఎం జగన్‌

సాధారణంగా ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చే నేతలు చాలా తక్కువగా ఉంటారు. ఎన్నికల ప్రచారం సమయంలో.. ప్రజలకు భారీ హామీలిస్తారు.. తీరా గెలిచాక మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనీసం జనాలు ముఖాలు చూడరు. ఏదో ఎన్నికల ముందు ఆదరాబాదరా.. కొన్ని హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి భిన్నమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సమాజంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా.. నవ రత్నాల పేరుతో.. సంక్షేమ పథకాలను రూపొందించి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటిని అమలు చేస్తూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్‌.

తామంత సీఎం జగన్‌ వెంటే అంటూ జనాలు మద్దతు తెలుపుతున్నారు. ఇక సర్వేలన్ని.. కూడా మారోసారి జగనే సీఎం అని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఇక జగన్‌ని ఓడించడం కోసం విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సరే.. జనాలు మాత్రం సీఎం జగన్‌ వెంటే ఉన్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు.

175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలతో.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్‌ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించారు. 175 కి 175 గెలవడం కోసం రెండు సరికొత్త కార్యక్రమాలతో జనాల ముందుకు వెళ్లనున్నాట్లు చెప్పుకొచ్చారు సీఎం జగన్‌.

‘‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. ప్రజల్లో మన పార్టీ పట్ల, పాలన పట్ల సానకూల స్పందన కనిపిస్తుంది. రానున్న ఆరు నెలలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’’ అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్‌.

‘‘ఇక వచ్చే రెండు నెలల్లో.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. గతంలో మనం చేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి చాలా మంచి స్పందన లభించింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. లబ్ధిదారులందరినీ జల్లెడ పట్టి.. వారిందరికీ సహాయ, సహకారాలు అందిస్తూ మంచి చేయగలిగాం. అర్హులైనవారికి అవసరమైన ధృవపత్రాలను జారీచేశాం’’ అని తెలిపారు సీఎం జగన్‌.

ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం..

‘‘మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదటి దశకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక జగనన్న సురక్ష కార్యక్రమం మొదటి దశలో భాగంగా వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి జనాలకు వివరిస్తారు. ఆ తర్వాత రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఇక వారందరికి ఆరోగ్యశ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా అవగాహన కల్పిస్తారు. అనంతరం మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారు. ఇక నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత అందిస్తాము’’ అని తెలిపారు సీఎం జగన్‌.

Show comments