కడపలో పైలెట్ శిక్షణ కేంద్రం..

దేవుని గడపగా పేరొందిన ప్రఖ్యాత వైఎస్సార్ కడప జిల్లా ప్రధానకేంద్రం కడపలో పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. కడప విమానాశ్రయంలో పైలెట్‌ శిక్షణ కోసం ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీఓ) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బుధవారం లోక్‌సభలో తన శాఖ బడ్జెట్‌ వ్యవహారం మీద జరిగిన చర్చకు బదులిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ దేశంలో ఉన్న 24 ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌లకు సరికొత్త శక్తినివ్వడానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.

పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు 229 విమానాలు అందుబాటులో ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కరోనా పరిస్థితుల్లో కూడా 862 మంది కొత్త కమర్షియల్‌ పైలెట్లకు లైసెన్సులు జారీ చేశాం అని ఆయన వెల్లడించారు. ఇక రెండో దశలో 10 విమానాశ్రయాల్లో 15 శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టామని చెబుతూ అందులో కడప, కూచ్‌బిహార్‌, తేజూ, ఝార్సుగూడ, దేవ్‌గఢ్‌, మేరఠ్‌, కిషన్‌గఢ్‌, హుబ్బళ్లి, భావ్‌నగర్‌, సాలెం ఉన్నాయని సింధియా వివరించారు. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ అంశం మీద కేంద్ర పౌరవిమానయానశాఖ నుంచి కడప విమానాశ్రయానికి సందేశం అందింది.

దేశంలో 17 విమానాశ్రయాల్లో పైలెట్ శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయనుండగా ఇందులో కడప ఉన్నట్లు అప్పట్లో పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఇక ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణా కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) కూడా గత ఏడాది ప్రతిపాదనలు సిద్ధంచేసింది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో కర్నూలులో పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.

Show comments