Idream media
Idream media
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చిచ్చు రాజుకుంటోంది. పార్టీ ఘోరపరాజయానికి నాయకత్వలోపమే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో.. పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ ఈ నెల 4వ తేదీన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలివిడతగా దక్షిణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శశికళతో ఎవరూ భేటీ అవ్వొద్దని, ఆమె పర్యటనకు నేతలు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
అయితే పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా పలువురు నేతలు శశికళతో భేటీ అవుతున్నారు. ఈ రోజు శశికళతో పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా తిరుచెండూర్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ తాజా పరిస్థితి, భవిష్యత్‌పై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. శశికళతో రాజా భేటీ అయిన వెంటనే.. ఆయనపై అన్నాడీఎంకే క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు.
ఈ నిర్ణయంతో అన్నాడీఎంకే నేతలకు పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. శశికళతో భేటీ అయితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదనే సందేశాన్ని తన సొంత సోదరుడిపై బహిష్కరణ వేటు వేయడం ద్వారా పన్నీర్‌సెల్వం బలమైన సంకేతాలు పంపారు. శశికళను పార్టీలోకి రానీయకుండా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలు ఏ స్థాయిలో పని చేస్తున్నారో ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. శశికళ కార్యకర్తల్లోకి వెళితే.. పార్టీ తమ నుంచి చేజారిపోతుందనే ఆందోళనతో పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలు ఉన్నారు. అందుకే ఆదిలోనే పార్టీ నేతలను నిలువరించేందుకు సోదరుడు రాజాపై పన్నీర్‌సెల్వం వేటు వేసినట్లు అర్థమవుతోంది. అయితే ఈ నిర్ణయం పార్టీ నేతలు.. శశికళతో భేటీ కాకుండా నిలువరిస్తుందా..? లేదా..? చూడాలి.