అస్సాం పైనా ఆప్ చూపు

ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో శ‌క్తివంత‌మైన పార్టీగా త‌యార‌య్యేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. మెల్లి మెల్లిగా ఒక్కో రాష్ట్రంలో అడుగుపెట్టే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. పంజాబ్‌ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిన్సుకియా, లఖింపూర్‌లలో రెండు వార్డుల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల్లో ఆప్‌ తన ఖాతాను తెరిచిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల తర్వాత అస్సాంలోని గువాహతి మునిసిపల్‌ కౌన్సిల్‌(జీఎంసీ)కి ఈ నెల 21న జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో దించింది.

మొత్తం 60వార్డులుండగా.. 39 వార్డుల్లో ఆప్‌ పోటీ చేస్తోంది. పార్టీ విస్తరణలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి నిజాయితీ కలిగిన రాజకీయాలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని ఆప్‌ అస్సాం ఇన్ఛార్జి రాజేశ్‌ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని.. బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వారికి మంచి ప్రత్యామ్నాయంగా ఆప్‌ నిలుస్తోందన్నారు. మొత్తం 200మంది పోటీలో ఉండగా.. వారిలో 55మంది కాంగ్రెస్‌, 53మంది బీజేపీ అభ్యర్థులున్నారు.

అలాగే.. గుజ‌రాత్ పై దృష్టిపెట్టిన ఆప్ ఇటీవ‌ల‌ సబర్మతి ఆశ్రమం సంద‌ర్శించిన కేజ్రీవాల్ అహ్మదాబాద్‌ వీధుల్లో తిరంగాయాత్ర పేరిట రోడ్ షో నిర్వ‌హించారు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. గుజ‌రాత్ లో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుజ‌రాత్ లో అవినీతిని రూపుమాపేందుకే ఇక్కడికి వచ్చానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆప్ కు ఒక అవ‌కాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్‌ ల మాదిరిగా గుజ‌రాత్ ను తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.

Show comments