Idream media
Idream media
ఇటీవల విజయవాడలో ఫై ఓవర్ల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రానికి కావాల్సిన రహదారులపై సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ అడిగిన ప్రాజెక్టులు అన్నింటినీ మంజూరు చేస్తామని గడ్కరీ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నితిన్ గడ్కారి రోజుల వ్యవధిలోనే ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి – పీలేరు మధ్య ఉన్న 71 జాతీయ రహదారిని నాలుగు లైన్లగా విస్తరించే ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 56 కిలోమీటర్ల పొడవైన ఈ 71 జాతీయ రహదారిని 1852.12 కోట్ల రూపాయలతో విస్తరించబోతున్నామని ప్రకటించింది. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతమాల ప్రాజెక్టు కింద ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తామని తెలిపారు.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీకి రాష్ట్రంలో చేపట్టాల్సిన వివిధ రోడ్డు ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ అందుకు సంబంధించిన నివేదికను సీఎం జగన్ అందించారు. సీఎం జగన్ 20 ఎంవోయూలను అడుతుతున్నారని, తాను 30 ఇస్తున్నామంటూ నితిన్ గడ్కరీ విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు.
సీఎం జగన్ ఇచ్చిన నివేదికలో అనంతపురం – అమరావతి మధ్య ఆరు లేన్ల పొడవు గల 335 కిలోమీటర్ల రహదారి, అమరావతిలో 187 కిలోమీటర్ల పొడవైన రింగు రోడ్డు, పోరుమామిళ్ల – సీఎస్ పురం, సీఎస్ పురం – సింగరాయకొండ, నాగార్జున సాగర్‌డాం – దేవుల పల్లి, కావలి – ఉదయగిరి – సీతారామపురం, మైదుకూరు–పోరుమామిళ్ల, బేస్తవారిపేట – ఒంగోలు, చిత్తూరు – మోటు సహా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో పలు ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధం కాగా.. మరికొన్ని ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రతిపాదనలు అన్నీ కార్యరూపం దాల్చితే రాబోయే కొన్నేళ్లలో ఏపీలో ఉపరితల రావాణా వ్యవస్థ ఉన్నతమైన స్థితిలో ఉంటుంది.