Dharani
ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితం, పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..
ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితం, పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..
Dharani
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కు జనాల్లో విపరీతమైన ఆదరాభిమానులు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ చనిపోయి ఏళ్లు కావొస్తున్నా.. జనాల గుండెల్లో మాత్రం ఆయన పదిలంగా ఉన్నారు. ఇక ఆయన పాదయాత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం, పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా యాత్ర 2. డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.
యాత్ర మూవీని రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కించగా.. యాత్ర 2లో మాత్రం కేవలం జగన్ రాజకీయ జీవితాన్ని.. తండ్రి మాట కోసం నిలబడిన కొడుకు చేసిన పాదయాత్రని చూపించారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటించగా.. జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ఈసినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు, జగన్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి శుభవార్త. యాత్ర 2 ఓటీటీల్లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ వివరాలు మీకోసం..
యాత్ర 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. థియేటర్లలో విడుదలైన 2 నెలల తర్వాత యాత్ర 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం అనగా నేటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అటు అమెజాన్ గానీ.. ఇటు చిత్రయూనిట్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. యాత్ర 2లో కోలీవుడ్ హీరో జీవా జగన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ లో అచ్చుగుద్దినట్లు జగన్ ని దింపేశాడు జీవా. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల్లోని ప్రజలు జీవాను చూసి జగన్ అని భావించారు.. అంటే అతడు ఆ పాత్రలో ఎంతలా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇక సినిమాలో జీవాతో పాటు మహేష్ మంజ్రేకర్, కేతకీ నారయణన్ కీలక పాత్రల్లో నటించారు.