అంబటి రాంబాబుకు కరోనా… వీడియో సందేశంలో కీలక అభ్యర్థన..

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులు, అనుచరులు, సహచరులకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. తనకు కరోనా సోకినట్లు ఈ రోజు మంగళవారం ఉదయం తెలిసినట్లు అంబటి రాంబాబు ఆ వీడియోలో చెప్పారు. వెంటనే ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆర్‌పీసీ టెస్ట్‌లో వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు. ఉదయం నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, వారందరితో మాట్లాడడం వీలుకావడంలేదని అంబటి పేర్కొన్నారు. అందుకే ఈ వీడియో సందేశం ఇస్తున్నట్లు తెలిపారు. తనకు ఎవరూ కాల్‌ చేయవద్దని కోరారు. తాను ధైర్యంగా ఉన్నాని, వైరస్‌ నుంచి కోలుకుని తప్పకుండా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరూ అందోళన చెందవద్దని కోరారు.

ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు పలువరు వైరస్‌ బారినపడ్డారు. వారిలో పలువురు కోలుకోగా మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. శృంగవరపుకోట, కోడుమూరు, కడప ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, డా.సుధాకర్, అంజాద్‌ భాషలు వైరస్‌బారినపడి కోలుకోగా.. సూళ్లూరుపేట, శ్రీశైలం, పొన్నూరు ఎమ్మెల్యేలు కిలేవేటి సంజీవయ్య, శిల్పా చక్రపాణి, కిలారు రోసయ్యలు చికిత్స తీసుకుటున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబుకు వైరస్‌ సోకడంతో ఈ మహమ్మరి బారినపడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. పలువరు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాక సిబ్బంది కూడా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.

Show comments