Idream media
Idream media
కరోనా విపత్తు వేళ ఆర్థిక ఇబ్బందులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగించడంలో సతమతమవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాఫీగా సాగిపోతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తోంది. ఎప్పటికప్పడు కొత్త పథకాలు ప్రారంభిస్తూ ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హమీని అమలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మేనిఫెస్టోలోని అంశాలు 90 శాతం అమలు చేసిన వైఎస్ జగన్.. మిగతా హామీల అమలకు ఉద్విక్తులయ్యారు.
ఈ రోజు బుధవారం మరో పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ బీమా పేరుతో ప్రారంభించబోతున్న ఈ పథకం పరిధిలోకి రాష్ట్రంలోని 1.41 కుటుంబాలు వస్తున్నాయి. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయస్సు ఉన్న వారికి ఈ బీమా వర్తిస్తుంది. 18–50 ఏళ్ల వారు సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణం,శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షల రూపాయలు చెల్లిస్తారు. 51–70 ఏళ్ల వారికి ప్రమాదవశాత్తు మరణం,శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 3 లక్షల రూపాయలు, 18–70 ఏళ్ల వారికి పాక్షిత శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 1.50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తారు.
ఈ పథకం అమలు కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్లు తమ పరి«ధిలోని రేషన్‌కార్డు కుటుంబాలలోని వారందరి వివరాలు సేకరించారు. రేషన్, ఆధార్‌కార్డుల సమాచారం వారి వద్ద ఉండడంతో బ్యాంకు ఖాతాను సేకరించారు. ఈ సమాచారాన్ని యాప్‌లో నమోదు చేశారు. కొత్తగా రేషన్‌కార్డు పొందేవారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత వారం రోజుల్లో బీమాకు సంబంధించిన కార్డును వలంటీర్లు ప్రజలకు అందజేయనున్నారు. బీమా క్లెయిమ్‌ను 15 రోజుల్లో పూర్తి చేసేలా జగన్ సర్కార్ కాల వ్యవధిని నిర్ణయించింది. పక్షం రోజుల్లోనే బీమా సొమ్మును నామినీ ఖాతాలో జమ చేయనున్నారు. ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదుల కోసం ప్రభుత్వం 155214 టోల్ ఫ్రి నంబర్‌ను ఏర్పాటు చేసింది.