iDreamPost
iDreamPost
మీది తెనాలి.. మాది తెనాలి.. అంటూ కొన్నేళ్ల క్రితం ఓ సినిమాలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం సృష్టించిన కామెడీ బాగా పండింది. ఆ డైలాగ్ కూడా జనానికి బాగా కనెక్ట్ అయ్యింది. వాస్తవానికి ఇదే అర్థం వచ్చే మరో నానుడి దాదాపు శతాబ్దం క్రితం నుంచే వాడుకలో ఉంది. అదే ‘మనం మనం బరంపురం’. ఊరుగాని ఊరిలో.. పరిచస్తులు, తెలుగువారు లేని ప్రాంతాల్లో హఠాత్తుగా తెలుగువారు తారసపడితే సంబరంగా చెప్పుకునే మాట ‘మనం మనం బరంపురం’.. స్థూలంగా చెప్పాలంటే మనమంతా ఒకటేనని, ఓకే ప్రాంతం వాళ్లమని ఆనందం వ్యక్తం చేయడమే. అయితే ఈ నానుడి ఎప్పుడు ఎలా పుట్టిందో.. బరంపురం నగరానికి దీనికి ఉన్న సంబంధమేమిటో ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.
కానీ ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు తరచూ ఈ నానుడిని ఉపయోగించేవారు. బరంపురానికి చెందిన ఆయన ఇతర ప్రాంతాల్లో ఎవరైనా తెలిసిన వారు, తెలుగువారు కనిపిస్తే మనం మనం బరంపురం అంటూ వారితో కలిసిపోయేవారు. బరంపురం అంటే ఆయనకు అంత అభిమానం. ఈ నగరం ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో రెండో ముఖ్య నగరంగా ఉన్నా.. ఒకప్పుడు తెలుగువారికి ఆటపట్టుగా ఉండేది. ఇప్పటికీ అక్కడ తెలుగువారు గణనీయ సంఖ్యలో ఉన్నా.. ఒడియా భాషా సంస్కృతులను ఒంటబట్టించుకొని ఒడియా సమాజంలో కలిసిపోయారు.
తెలుగు సంస్కృతి, కళలకు కాణాచి
బెర్హంపూర్ లేదా బరంపురంగా పిలిచే బ్రహ్మపురం ఒకప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగం. ప్రస్తుతం ఒడిశాలో ఆంధ్ర సరిహద్దు ఇచ్ఛాపురాన్ని ఆనుకొని ఉన్న గంజాం జిల్లా వరకు మద్రాస్ రాష్ట్రం విస్తరించి ఉండేది. గంజాం జిల్లాలో ముఖ్య నగరమే బరంపురం. 1867లో మున్సిపాలిటీగా ఏర్పడిన ఆ నగరం ఒడిశాలోనే మొదటి మున్సిపాలిటీ. 2007లో నగరపాలక సంస్థ హోదా పొందింది. 1672లో ఈ ఊరు ఆవిర్భవించినట్లు చెబుతారు. ప్రస్తుతం నగరంలో కలిసిపోయిన లాఠీ అనే గ్రామంలో పురాతన బ్రహ్మశ్వర ఆలయం ఉంది. ఆ పేరుతోనే బ్రహ్మపురంగా స్థిరపడింది. మనదేశాన్ని పాలించిన బ్రిటీషర్లు ఈ పేరును పలకలేక బ్రహ్మపురాన్ని కాస్త బెర్హంపూర్ చేసేశారు. దాన్నే కాలక్రమంలో మన తెలుగువారు బరంపురంగా వాడుకలోకి తెచ్చారు. అయితే ఇటీవలే ఒడిశా ప్రభుత్వం అసలు పేరు అయిన బ్రహ్మపురం నే అధికార నామంగా స్థిరపరిచింది. పేరులోనే తెలుగుదనం సంతరించుకున్న బరంపురం ఒకప్పుడు అచ్చ తెలుగు ప్రాంతంగా విరాజిల్లేది.
Also Read : నాడు ఇందిర.. నేడు మమత.. అర్థ శతాబ్ది క్రితం నాటి నినాదం రిపీట్
సగానికిపైగా జనాభా తెలుగే మాట్లాడేవారు. తెలుగు మీడియం పాఠశాలలు, కళాశాలలు ఉండేవి. ఉత్కలాంధ్ర సంస్కృతి సంప్రదాయాలకు కేంద్రంగా ఉండేది. ఎంతో మంది తెలుగు కవులు, రచయితలు బరంపురంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కవి, పండిత శ్రేష్ఠులు తరచూ బరంపురంలో జరిగే సాహితీ చర్చలు సమ్మేళనాల్లో పాలుపంచుకునేవారు. ఆంధ్ర భాషాభివర్ధిని సమాజం, వికాసం, వేగుచుక్క గ్రంధాలయం తెలుగు భాషా సౌరభాలను వెదజల్లేవి.
రాజకీయాల్లోనూ రాణింపు
బరంపురం సామాజిక, ఆర్థిక వికాసాలతో పాటు రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించి ఉన్నత స్థానాలు అలంకరించారు. భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన వరహాగిరి వెంకట గిరి (వి.వి.గిరి) బరంపురం వాసే. మన తెలుగువారే. విదేశాల్లో బారిష్టర్ చదివిన ఆయన తిరిగివచ్చిన తరవాత ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. జాతీయ రైల్వే యూనియన్లో అనేక పదవులు నిర్వహించి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎంపీగా కూడా చేశారు. ఆయన తండ్రి వరహాగిరి జోగయ్యపంతులు సాహిత్య అభిమాని పోషకుడు. వీరిద్దరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఇక ప్రముఖ సాహితీవేత్త అయిన ఉన్నవ రామలింగం మాస్టారు బరంపురం మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని కల్లికోట కేంద్రంగా పాలించిన రాజవంశానికి చెందిన రాణి సుజ్ఞానిదేవి తెలుగు మూలాలు ఉన్నవారే. ఆమె మొదట కాంగ్రెస్ నుంచి.. తర్వాత ప్రస్తుత అధికార పార్టీ అయిన బిజూ జనతాదళ్ తరఫున 1974 నుంచి 2004 వరకు మధ్యలో 1980 ఎన్నికలు మినహాయించి ఏకధాటిగా ఎమ్మెల్యేగా పనిచేశారు. భారత వాయుసేన కోసం తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ రూపొందించిన వైజ్ఞానిక బృందంలో సభ్యుడైన కోట హరినారాయణ బరంపురానికి చెందిన వారే కావడం విశేషం. ఇలా ఏ రంగంలో.. ఏ ప్రాంతంలో చూసినా బరంపురం తెలుగువారు కనిపిస్తారు. అందుకేనేమో మనం మనం బరంపురం అంటారు.
Also Read : పిల్లి కథ