iDreamPost
iDreamPost
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని కొంతమంది సరిగ్గా అర్ధం చేసుకోక దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దొరికిందే సందని అగ్నిపథ్ ని వ్యతిరేకిస్తూ యువతని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ ని వ్యతిరేకిస్తూ హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఇవాళ (జూన్ 17) ఉదయం నుంచి సికింద్రాబాద్ లో కూడా కొంతమంది పక్కా ప్లాన్ చేసి రైల్వేలను, రైల్వే ఆస్తులని నాశనం చేశారు.
దీంతో సికింద్రాబాద్ రణరంగంగా మారింది. ఇలాంటి పరిస్థితులని అదుపు చేయాల్సిన ప్రభుత్వమే మరింత రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తుంది. తాజాగా జరిగిన సంఘటనలపై మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ ని ఆయన సమర్ధించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాన్ని విజయపథంలో నడిపించిన మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ అగ్నిపథ్ ని సపోర్ట్ చేస్తూ మీడియాతో పలు వ్యాఖ్యలు చేశారు.
వీపీ మాలిక్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న వారిని తీసుకునేందుకు ఆర్మీ ఎప్పుడూ ఆసక్తి చూపదు. రైల్వేలు, బస్సులు తగలబెట్టే పోకిరీలని ఆర్మీ ప్రోత్సహించదు. ఇప్పుడు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనల్లో బస్సులు, రైళ్లపై దాడులకు పాల్పడుతూ గూండాయిజం చేసేవారిని కూడా భారత సైన్యం కోరుకోదు. సాయుధ బలగాలు అంటే స్వచ్ఛందంగా పనిచేసే బలగాలు. ఇది సంక్షేమ సంస్థ కాదు. దేశాన్ని అనుక్షణం రక్షిస్తూ, దేశంకోసం పోరాడే ఉత్తమ పౌరులు ఇందులో ఉండాలి. అంతేకాని బస్సులు, రైళ్లు తగలబెడుతూ గూండాయిజానికి పాల్పడేవారు సాయుధ బలగాల్లో ఉండాలని మేము కోరుకోము అని అన్నారు.
ఇటీవల కరోనా వల్ల నియామకాలను నిలిపివేసినందున పరీక్షను పూర్తిచేయని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం వారిలో కొందరి వయసు పెరిగి ఆర్మీలో ప్రవేశానికి అనర్హులుగా మారిన మాట వాస్తవం. ఈ విషయంలో వారి ఆందోళన, నిరాశను అర్థం చేసుకోగలను అని తెలిపారు. నిజంగా దేశం కోసం పోరాడాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఇలా చేయరు అని అన్నారు.