పంచాయతీ ఎన్నికలు మళ్లీ నిలిచిపోనున్నాయా..?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా జరగబోతున్నాయా..? గత ఎన్నికల్లో అసాధారణ పరిస్థితుల మధ్య ఎక్కడో ఒక చోట రీ పోలింగ్‌ జరగ్గా.. తాజా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ చోట్ల రీపోలింగ్‌ జరగబోతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు ఇ–వాచ్‌ యాప్ ను ఆవిష్కరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు పై అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఇ–వాచ్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని, తీవ్రమైన ఫిర్యాదులపై అరగంటలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్పందించకపోతే.. తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని నిమ్మగడ్డ చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో తాను ఎలా వ్యవహరిస్తానో కూడా నిమ్మగడ్డ పేర్కొన్నారు. తీవ్రమైన ఫిర్యాదులు వచ్చిన చోట.. ఎన్నికలను రద్దు చేస్తానని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తానని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

ఎన్నికల్లో ఫిర్యాదులను స్వీకరించడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేయించడం, ఫిర్యాదుల స్వీకరణ, క్రోడీకరణకు ప్రైవేటు వ్యక్తులతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఫిర్యాదులు రాగానే.. అక్కడ పోలింగ్‌ నిలిపివేయడం, అప్పటి వరకు జరిగిన పోలింగ్‌ను రద్దు చేయడం వంటి నిర్ణయాలను నిమ్మగడ్డ తీసుకోబోతున్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీకి, నిమ్మగడ్డకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు, హోరాహోరీ పోటీ ఉన్న ప్రాంతాలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రత్యేకంగా నిఘా పెట్టే అవకాశాలున్నాయి. రెచ్చగొట్టే ధోరణలుతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కల్పించే అవకాశాలున్నాయి. తిరిగి టీడీపీనే సదరు ఘటనలను వీడియోలు, ఫోటోలు తీసి ఇ–యాప్‌లో ఫిర్యాదు చేయడం, దాన్ని పరిగణలోకి తీసుకుని సదరు పంచాయతీ/పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్‌ జరిపేలా నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు.

నిబంధనలకు విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిమ్మగడ్డ తెచ్చిన ఇ–వాచ్‌ యాప్‌ నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. దానిపై రేపు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంటే సమస్యేలేదు. కానీ ఎన్నికల పర్యవేక్షణకు ఇ–యాప్‌ను నిమ్మగడ్డ ఉపయోగిస్తే మాత్రం రాష్ట్రంలో అనేక పంచాయతీలకు మళ్లీ రీ పోలింగ్‌ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లుపై కాకుండా.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. మునపటి కంటే.. ఈ సారి ఏకగ్రీవమయ్యే పంచాయతీల సంఖ్య భారీగా తగ్గుతుందంటూ నొక్కి వక్కాణించడం నిమ్మగడ్డ తీరు ఎలా ఉందో తెలుపుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏపీలోని కొంత మంది ఓటర్లకు రెండో సారి కూడా ఓటు వేసే పరిస్థితి రావొచ్చు.

Show comments