iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మండలి రద్దు తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. బీఏసీ సమావేశం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ వినతి మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో మండలి రద్దయితే ఏపీ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులకు గండం పొంచి ఉంది. అందులో ఒకరు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా, మరొకరు మోపిదేవి వెంకట రమణ. ఈ ఇద్దరు గత సాధారణ ఎన్నికల్లో బరిలో దిగి పరాజయం పాలయ్యారు. పిల్లి బోస్ మండపేట నుంచి బరిలో దిగి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతిలో ఓటమి చెందగా, రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఓటమి పాలయిన తన సన్నిహితులిద్దరికి క్యాబినెట్ లో ఛాన్స్ ఇవ్వడం ద్వారా జగన్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
అప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీ బరిలో దిగగా, మోపిదేవిని మాత్రం ఓటమి పాలయిన తర్వాత మండలి సభ్యుడిగా జగన్ నామినేట్ చేశారు. దాంతో ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఈ ఇద్దరు నేతలు మండలి నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.
ఇప్పుడు మండలి కథ ముగిసిపోయే అవకాశం ఉందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ ఇద్దరి పరిస్థితిపై చర్చ సాగుతోంది. మండలి రద్దయితే ఈ ఇద్దరూ ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం సంపాదించాల్సి ఉంటుంది. లేని పక్షంలో క్యాబినెట్ నుంచి వైదొలగక తప్పదు. వారి అసెంబ్లీకి రావాలంటే ఉప ఎన్నికలు అనివార్యం. అలాంటి అవకాశాలు లేవు. ఈ తరుణంలో జగన్ మంత్రివర్గ సహచరుల పదవులకు ముప్పు తప్పదని కూడా భావిస్తున్నారు.
బీసీ సామాజికవర్గాల్లోని రెండు కీలక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలకు పదవీ గండం పొంచి ఉన్న తరుణంలో
వారికి ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జగన్ ఎలాంటి పథక రచన చేస్తారనే చర్చనీయాంశం అవుతోంది. ఒకవేళ ఇద్దరూ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వస్తే ఆయా సామాజికవర్గాల నుంచి మరో ఇద్దరికి అవకాశం అనివార్యం అవుతోంది. కీలక సామాజికవర్గాలు కావడంతో క్యాబినెట్ లో చోటు కోసం పలువురు పోటీ పడతారనడంలో సందేహం లేదు. అయితే ప్రాంతీయంగా చూసినా తూగో జిల్లా నుంచి పిల్లి బోస్, గుంటూరు నుంచి మోపిదేవి స్థానంలో మరో ఇద్దరిని ఎంపిక చేయాల్సి వస్తే వారు ఎవరనే ప్రశ్నలు కూడా అనివార్యం. ఈ నేపథ్యంలో మండలి పరిణామాలు మంత్రిమండలి మీద కూడా ప్రభావం చూపే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాంతో జగన్ అడుగులు ఎటు అన్నదే ఉత్కంఠగా మారుతోంది.