ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారా.. ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల ఆర్థిక సాయం!

మనిషి కనీస అవసరాలు అంటే కూడు, గూడు, గుడ్డ. నేటి రాకెట్‌ యుగంలో కూడా ఈ పరిస్థితిలో మార్పు రాలేదంటే.. మన సమాజంలో అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటికి కూడా మన దేశంలో… సొంత ఇళ్లు లేని జనాలు ఎందరో ఉన్నారు. ఎన్నికల సమయం మొదలు.. సందర్భం దొరికిన ప్రతి సారి.. నేతలు, తమకు అవకాశం ఇస్తే.. సొంతింటి కలను నేరవేరుస్తామని హామీలిస్తారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఏకంగా పేదలకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో విజయం సాధించినా.. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీ వెనకబడింది. ఇక నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రామాల్లో సైతం కనీసం రూ. 10 లక్షలు లేనిదే ఇంటి నిర్మాణం పూర్తి కావడం లేదు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు కట్టుకునేవారికి రూ. 3 లక్షలు ఇస్తామని ప్రకటించింది. మరి దానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు విధానం ఏంటి అంటే..

సొంత జాగా ఉండి ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం మొత్తం రూ. 7,350 కోట్లు ఖర్చు చేయనుంది.

రాష్ట్రప్రభుత్వ సాయంతో నిర్మించే ఇంటిని మహిళ పేరు మీదటే మంజూరు చేస్తారు. పథకం అమలుకు జిల్లాల్లో కలెక్టర్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రేటర్‌ కమిషనర్‌ నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం వాటా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అందించే రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దశల్లో ఇవ్వనున్నారు. ఇంటి బేస్‌మెంట్‌ స్థాయిలో మొదటిసరాఇ రూ.లక్ష, పైకప్పు దశలో రెండో సారి మరో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక మూడోసారి అనగా ఆఖరులో రూ.లక్ష చెల్లిస్తారు.

గృహలక్ష్మి పథకానికి అర్హతలు, మార్గదర్శకాలు..

  • గృహలక్ష్మి పథకం కింద నిర్మించ ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు.
  • లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖాళీ జాగా ఉండాలి.
  • లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబ సభ్యుల పేరిట ఆహార భద్రతా కార్డు ఉండాలి.
  • లబ్దిదారుడు తనకు నచ్చిన డిజైన్‌లో ఇంటిని నిర్మించుకోవచ్చు.
  • ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయం కేవలం రెండు పడకల ఆర్సీసీ ఇంటి నిర్మాణానికే వర్తిస్తుంది.
  • లబ్ధిదారుడు అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
  • ఆధార్‌/ఓటర్‌ ఐడీకార్డులు ఉండాలి. బ్యాంకులో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి.
  • ఎవరికైనా ఇప్పటికే ఆర్సీసీ రూఫ్‌తో కూడిన ఇల్లు ఉన్నా, జీవో 59 కింద లబ్ధి పొందినా పథకం వర్తించదు.
  • ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ, మైనార్టీలు కలిపి 50 శాతం ఉండాలి అని ప్రభుత్వం సూచించింది.
  • నిధుల విడుదల అధికారం పూర్తిగా జిల్లా కలెక్టర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌దే.
  • ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ‘గృహలక్ష్మి’ లోగోను తప్పనిసరిగా అతికించాలి అని అధికారులు సూచించారు

అంతా ఆన్‌లైన్‌లోనే..

గృహలక్ష్మి పథకం అమలు మొత్తం.. ఆన్‌లైన్‌లోనే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పర్యవేక్షణలో గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్‌ను, మెుబైల్ యాప్‌ను రూపొందించనుంది. జిల్లాల వారీగా ప్రజల నుంచి కలెక్టర్లు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అర్హుల జాబితాను కలెక్టర్లే ఫైనల్ చేయనున్నారు. దశల వారీగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఇళ్లను మంజూరు చేస్తారు.

Show comments