Uppula Naresh
Uppula Naresh
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. మరీ ముఖ్యంగా గ్రామాల్లో అయితే వాగులు, వంకులు పొంగి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ తల్లి, కూతురు వాగును దాటే ప్రయత్నంలో నీటి ప్రవాహానికి కూతురు కళ్లముందే తల్లి వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ మహిళ వాగులో కొట్టుకుపోయింది. కూతురు కళ్లముందే తల్లి కొట్టుకుపోవడంతో ఆ మహిళ గుండెలు పగిలేలా రోదించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు బుధవారం అదే ఊరిలో పొలం పనులకు వెళ్లారు. ఇక సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అందరూ కుమ్మరివాగు దాటే ప్రయత్నం చేశారు. అలా కొంత మంది ఆ వాగును దాటారు. కానీ, కుంజ సీతమ్మ, ఆమె కూతురు వాగులో గల్లంతయ్యారు. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేశారు.
అయితే, వీరిని కాపాడే ప్రయత్నంలో కూతురుని రక్షించగా, ఆమె తల్లి మాత్రం నీటి ప్రవాహానికి వాగులో కొట్టుకుపోయింది. కూతురు కళ్లముందే తల్లి వాగులో కొట్టుకుపోవడంతో ఆ మహిళ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ సీన్ చూసిన స్థానికులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక సీతమ్మ ఆచూకి లభించకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో సీతమ్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానింకగా తీవ్ర విషాదంగా మారింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఆకలితో తెలంగాణ యువతి! కేంద్ర మంత్రికి తల్లి లేఖ!