రెండోసారి తిరుమల మూసివేత.. 128 ఏళ్ల కిందట మొదటి సారి..

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్న ఆలయం మూసివేశారు. కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఆలయం మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిన్న గురువారం అలిపిరి గేట్లను మూసివేసిన అధికారులు, కొండపైన ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం వేగంగా చేయించి కిందకు పంపించారు. ఆ తర్వాత ఆలయం మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

శ్రీవారి ఆలయం మూసివేడం చరిత్రలో ఇది రెండోసారి. శతాబ్ధాల చరిత్ర ఉన్న తిరుమల వెంకన్న ఆలయం మొదటి సారి 128 ఏళ్ల కిందట1892లో మూసివేశారు. అప్పట్లో హంథీరాంజీ మఠం మహంతుకు, ఆలయ జియ్యంగార్లకు మధ్య తలెత్తిన ఆధిపత్య వివాదంతో ఆలయం రెండు రోజుల పాటు మూతపడింది. ఆ తర్వాత మానవ ప్రమేయం లేకుండానే ప్రస్తుతం మూతపడింది.

తిరుమలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యంత సున్నితమైన ప్రదేశంగా తిరుమల నిలిచింది. కరోనా వైరస్‌ భారతలో వ్యాపిస్తుందనే వార్తలు వ్యాపించినప్పటి నుంచి టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు రాకను తగ్గించేలా పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. గురువారం ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన 110 మంది భక్తుల్లో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో టీడీపీ ఉలిక్కిపడింది. అతన్ని తిరుపతిలోని స్విమ్స్‌కు పంపి పరీక్షలు చేయగా నెగిటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో వైరస్‌ ప్రభావం ఇప్పడిప్పుడే ప్రారంభమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికి మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో అంచనాలకు అందడంలేదు. ఈ నేపథ్యంలో తిరుమల ఆలయం ఎన్ని రోజుల పాటు మూసి ఉంచుతారనే అంశంపై స్పష్టత లేదు.

Show comments