Idream media
Idream media
ఏది ఎప్పుడు చేయాలో.. అది అప్పుడు చేయాలి.. లేదంటే ప్రయోజనం శూన్యం. అంతేకాదు నష్టం కూడా అపారం. ఈ విషయం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను చూస్తే తెలుస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి దేశంలోకి కరోనా వైరస్ వచ్చింది. వైరస్ ప్రారంభంలో.. అంటే దేశంలో కేవలం 618 కేసులు ఉన్నప్పుడు లాక్‌డౌన్ విధించారు. ఇప్పుడు ఆ కేసులు రెండు లక్షలు చేరువవుతున్న సమయంలో ఎత్తివేశారు. ప్రస్తుతం ఐదో దఫా లాక్‌డౌన్ అనేది అసలు లాక్‌డౌన్‌గా పరిగణించలేము. కేసులు వచ్చిన ప్రాంతం చుట్టుపక్కల కేవలం వందో, రెండు వందల మీటర్ల ప్రాంతాన్ని కంటైన్ చేయడాన్ని లాక్‌డౌన్‌గా చూడలేము.
యావత్ దేశ ప్రజలపై ప్రభావం చూపే పాలకుడి నిర్ణయం.. ఆచితూచి, ఆలోచించి తీసుకోవాలి. కానీ లాక్‌డౌన్ విధించే సమయంలో ఆలోచన, సమాలోచన, సూచనలు, సంప్రదింపులు ఏమీ లేకుండానే అప్పటికప్పుడు ప్రకటించారు. దీని ఫలితం రోజు వారీ పనులతో పొట్టుపోసుకునే కుటుంబాలు, వలస కార్మికులు, కూలీలకు ఎనలేని కష్టం, నష్టం తెచ్చిపెట్టింది.
లాక్‌డౌన్ విధిస్తున్నామని, అందుకు సిద్దం కావాలని సూచిస్తూ ఓ పది లేదా పదిహేను రోజులు సమయం ఇచ్చి ఉంటే.. ప్రస్తుతం దేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు కొంతమేరకైనా తగ్గేవి. వలస కూలీలు, కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేవారు. తిండి తిప్పలకు ఎంతో కొంత సిద్ధమైయ్యేవారు. కానీ అలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కేవలం నాలుగు గంటల సమయంలో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. 15 రోజులన్నది రెండు నెలలైంది. సరైన సమాచారం, అవగాహన కల్పించకుండా.. ఎప్పటికప్పుడు లాక్‌డౌన్ పొడిగించుకుంటూ పోవడంతో పేద ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. పాలకులు సానుభూతి చూపిస్తున్నారు కానీ వారి కష్టాలు తీర్చే శక్తి, సత్తా ఉన్నా ఆ ప్రయత్నం మాత్రం చేయడంలేదు.
దేశంలో మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 15 నాటికి కేసులు 11 వేలు మాత్రమే. అది కూడా కేవలం ప్రధాన నగరాల్లోనే ఈ కేసులు నమోదయ్యాయి. పట్టణాలు, మండల కేంద్రాలకు వైరస్ విస్తరించలేదు. లాక్‌డౌన్ వల్ల చేసేందుకు పని, తినేందుకు తిండి లేక కూలీలు, కార్మికులు, అదే సమయంలో కాలేజీలు, కార్యాలయాలు, హాస్టళ్లు మూసే సరికి విద్యార్థులు, ఉద్యోగులు నగరాల నుంచి తమ స్వస్థలాల బాటపట్టారు. దాంతో వైరస్ చిన్న చిన్న పట్టణాలకు కూడా వ్యాపించింది. అదే ఓ 10, 15 రోజులు సమయం ఇచ్చి లాక్‌డౌన్ పెడితే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం లేదు.
దేశంలో లాక్‌డౌన్ విధించే మార్చి 25వ తేదీ నాటికి కరోనా కేసులు 618, ఏప్రిల్ 1 నాటికి 1,897, ఏప్రిల్ 15 నాటికి 11 వేలు, ఏప్రిల్ 30 నాటికి 40,184, మే 15 నాటికి 85 వేలు, మే 31 నాటికి 1.90 లక్షలు.. ఈ గణాంకాలు చూస్తే లాక్‌డౌన్ ఎప్పుడు విధించాల్సిన అవసరం ఉందో తెలుస్తోంది. లాక్‌డౌన్ ఇప్పుడు అవసరం అనేది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాట. కానీ పాలకులు వైరస్ లేని సమయంలో అష్టదిగ్భందనం చేసి.. విజృంభిస్తున్న సమయంలో ఎత్తివేస్తున్నారు.
ప్రజలు భారీగా గూమికూడే అంశాలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడం ప్రస్తుతం అత్యంత ఆందోళన కలిగించే విషయం. భక్తి భావం అధికంగా గల మన దేశంలో ప్రార్థనా స్థలాలు ఎప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనా స్థలాలు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చారు. ఇక ఏమి జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.
ఓ వైపు కరోనా ముప్పు ఇప్పుడే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత అప్రమత్తత అవసరం అని నొక్కిమరీ చెబుతున్నారు. లేదంటే నవంబర్ నాటికి దేశంలోని సగం జనాభాకు వైరస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. మరో వైపు వర్షాకాలం ప్రారంభమైంది. కరోనాకు తోడు.. సాధారణ, విష జ్వరాలు, జలుబు అధికమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌లో కరోనా మహమ్మరి చూపే ప్రభావం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఓళ్లుగగ్గురుపుడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధమవడం తప్ప మరే మార్గం లేదు. స్వియ రక్షణే శ్రీరామ రక్ష.