iDreamPost
iDreamPost
Actress Archana Kavi ప్రముఖ మలయాళ సినీనటి, టీవీ హోస్ట్ అర్చనా కవి తనతో, తన ఫ్రెండ్స్ తో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అక్కడి పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. ఇటీవల అర్చన కవి తన స్నేహితులతో కలిసి రాత్రిపూట ఆటోలో వస్తుండగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తమ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని, పలురకాల ప్రశ్నలు అడిగాడని, తమతో సరిగ్గా ప్రవర్తించలేదు అని, ఆ సమయంలో తాము అభద్రతకు లోనైనట్టు భావించామని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ పోలీసు అధికారులని ట్యాగ్ చేసింది. సోషల్ మీడియాలో పోలీసుల గురించి ఓ నటి ఇలా పోస్ట్ చేయడంతో మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో కొచ్చి డీసీపీ నటి అర్చన ను, ఆ పోలీసు కానిస్టేబుల్ ని కూడా పిలిచి మాట్లాడారు. అనంతరం ఈ వ్యవహారంపై కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై అంతర్గత విచారణ చేశాము. సినీనటి, పోలీస్ ఇద్దరి వాదనలు విన్నాము. రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సినీనటి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉండటంతో గుర్తుపట్టలేకపోయారు. అయితే అవతలి వ్యక్తి నటి అయినా సాధారణ మహిళ అయినా చట్టాన్ని అమలు చేసేవారు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పోలీసుల పట్ల నటికి మంచి అభిప్రాయం ఉంది. కానీ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాలని చేయలేదు, పెట్రోలింగ్‌లో భాగంగానే వారి సమాచారాన్ని సేకరించేందుకు మాట్లాడాడు. అతన్ని హెచ్చరించాము. మరోసారి అతను ఇలా చేస్తే కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని తెలిపారు.
మలయాళంలో పలు సినిమాల్లో నటించిన అర్చనా కవి తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే సినిమాలో కూడా నటించింది.