మొదటి సైనిక తిరుగుబాటు విశాఖలోనే!

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటానికి బీజం వేసింది 1857లో జరిగిన సైనిక తిరుగుబాటేనని చెప్పుకుంటారు. అందుకే దానికి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పేరొచ్చింది. కానీ దానికి దాదాపు 77 ఏళ్ల ముందే బ్రిటీషర్లపై భారతీయ సైనికులు తిరుగుబాటు చేసిన మహోన్నత ఘట్టం వెలుగులోకి రాకుండా చరిత్ర గర్భంలో కలిసిపోయింది.

1780లో జరిగిన ఈ తిరుగుబాటుకు మన తెలుగు నేల.. మరీ ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరుగా మనం చెప్పుకునే విశాఖ నగరం వేదికైందని చాలామందికి తెలియదు. ప్రస్తుతం విశాఖ వన్ టౌన్ గా పిలిచే ప్రాంతంలో మొదటిసారి 1780 అక్టోబర్ మూడో తేదీన భారత సైనికుల తుపాకులు బ్రిటిష్ సైన్యంపై గర్జించి ముగ్గురు అధికారులను హతం చేశాయి. కాలగతిలో కలిసిపోయిన ఆనాటి తిరుగుబాటు ఘట్టాలను విశాఖకు చెందిన చరిత్ర పరిశోధకుడు విజ్జేశ్వరం ఎడ్వర్డ్ పాల్, ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ వెలుగులోకి తెచ్చారు.

వ్యతిరేకత వెల్లువలా తన్నుకొచ్చిన వేళ..

అప్పట్లో వైజాగుపటంగా వ్యవహృతమైన విశాఖలో బ్రిటీష్ సైన్యానికి ఒక రెజిమెంట్ ఉండేది. ఈ రెజిమెంట్లోని భారతీయ సైనికుల పట్ల వివక్ష చూపేవారు. వేతనాలు తక్కువ ఇవ్వడంతో పాటు.. పన్నుల వసూలుకు పంపినప్పుడు రవాణా ఛార్జీలు ఇచ్చేవారు కాదు. దాంతో భారతీయ సైనికులు అసంతృప్తితోనే పనిచేసేవారు. ఆ తరుణంలో మైసూర్ పాలకుడు హైదర్ అలీని తప్పించి మైసూరును స్వాధీనం చేసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమైన బ్రిటిష్ పాలకులు చివరికి ఆయనపై యుద్ధం ప్రకటించారు.

Also Read : తెలుగోడి రాజసం..మన కొండపల్లి కోట..

అయితే అప్పట్లో మద్రాస్ రెజిమెంట్లో ఉన్న సైన్యం యుద్ధానికి సరిపోదని భావించిన మద్రాస్ గవర్నర్ జాన్ వైట్ హాల్ ఏలూరు, మచిలీపట్నం, వైజాగుపటం రెజిమెంట్ల నుంచి సైన్యాన్ని పంపాలని మచిలీపట్నం, వైజాగ్ వర్తక కేంద్రాల చీఫ్ గా ఉన్న జాన్ హేన్రి కాస్ మేజరుకు 1780 సెప్టెంబర్ 14న లేఖ రాశారు. ఆ ప్రకారం వైజాగ్ రెజిమెంట్ సైనిక దళాలను నౌకల్లో మద్రాసుకు తరలించాలని హెన్రీ కాస్ నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. కానీ ఆ రోజుల్లో హిందూ సంప్రదాయాల ప్రకారం నౌకాయానానికి భారతీయులు ఇష్టపడేవారు కాదు. ఎవరో కొద్దిమంది వ్యాపారులు తప్ప సామాన్యులేవరు నౌకల్లో ప్రయాణాలు చేసేవారు కాదు. ఆ సంప్రదాయమే భారతీయ సైనికులను నౌకల్లో వెళ్లకుండా వెనక్కి లాగింది. దాంతోపాటు మైసూరు వెళ్లి భారతీయులతోనే తలపడటం నచ్చక భారత సైనికులు మొండికేశారు.

1780 అక్టోబర్ మూడో తేదీన ఉదయమే వన్ టౌన్ లోని పాత లైట్ హౌస్ సమీపంలో బ్రిటిష్ అధికారులు నౌకను సిద్ధం చేశారు. ఆ పక్కనే ఉన్న పరేడ్ గ్రౌండు(ప్రస్తుతం రిజిస్ట్రార్ ఆఫీస్, కన్వేయర్ బెల్ట్, క్వీన్ మేరీ పాఠశాల ఉన్న ప్రాంతాలు అప్పట్లో పరేడ్ గ్రౌండుగా ఉండేవి) లో ఉన్న భారత సైనికులతో మధ్యాహ్నం వరకు సంప్రదింపులు జరిపినా వారు వెళ్లేందుకు నిరాకరించారు. దాంతో బలవంతంగా వారిని నౌకల్లో ఎక్కించేందుకు బ్రిటిష్ అధికారులు ప్రయత్నించారు. అంతే.. భారతీయ సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుబేదార్ షేక్ అహ్మద్ నాయకత్వంలో తిరగబడ్డారు. తమ చేతుల్లో ఉన్న తుపాకులకు పని చెప్పారు. కాల్పుల్లో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఈ పరిణామాన్ని ఊహించని బ్రిటిష్ సైన్యం అధికారులు భయంతో పారిపోయారు. అయితే వర్తక కేంద్రాల చీఫ్ జాన్ హేన్రి కాస్ మేజర్ భారత సైనికులకు దొరికిపోవడంతో అతన్ని బంధించారు.ప్రాణభయంతో ఆయన తన వద్ద ఉన్న 21999 రూపాయల నగదు, పత్రాలు అప్పగించారు. భారత సైనికుల డిమాండ్లను అంగీకరిస్తూ పత్రం రాసిచ్చారు.

Also Read : బ్రిటీష్ పెత్తందారీని ఎదిరించిన నూజివీడు సంస్థాన చరిత్ర తెలుసా..?

వెతికి వెతికి కాల్చి చంపారు.

అనంతరం భారత సైనికులు అక్కడే సమావేశమై బ్రిటీషర్లతో యుద్ధంలో హైదర్ ఆలీకి సహకరించాలని తీర్మానించారు. వెంటనే బృందాలుగా విడిపోయి మైసూరు వైపు మార్చింగ్ మొదలు పెట్టారు. కాగా భారత సైనికుల తిరుగుబాటు గురించి తెలుసుకున్న బ్రిటిష్ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు.

మైసూరు వైపు వెళ్తున్న భారత బృందాలను వెతికి వెతికి పట్టుకున్నారు. అక్కడికక్కడే చాలామందిని కాల్చి చంపారు. కొందరిని వైజాగ్ తీసుకొచ్చి అందరి సమక్షంలో కాల్చి చంపారు. అక్టోబర్ ఎనిమిదో తేదీన దొరికిపోయిన తిరుగుబాటు నాయకుడు సుబేదార్ షేక్ అహ్మద్ ను వైజాగ్ తీసుకొచ్చి ఫిరంగి గొట్టానికి ఉండే రంధ్రం ముందు కట్టిపడేసి పేల్చేశారు. ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిన అతని శరీర భాగాలను స్థానికులు ఒకచోట చేర్చి మినార్ కట్టించారు. అలా మొదటి సైనిక తిరుగుబాటు అణచివేతకు గురైంది. చరిత్రకు అందకుండా పోయిన ఈ వివరాలు లండన్ ఆర్కివ్స్ మ్యూజియంలోని గెజెట్ లో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

Also Read : ఖమ్మం ఖిల్లా చరిత్ర తెలుసా..?

Show comments