టీడీపీని టెన్షన్ పెడుతున్న పనబాక లక్ష్మి

అసలే అవి ఉప ఎన్నికలు. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. అయినా టీడీపీ మాత్రం తొందర పడి ఓ కోయిలా ముందే కూసిందీ అన్నట్టుగా వ్యవహరించింది. తమ పార్టీ అభ్యర్థిని అందరికన్నా ముందే ప్రకటించింది. పనబాక లక్ష్మిని మళ్లీ పోటీలో నిలపాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడామె టీడీపీని టెన్షన్ పెడుతోంది. చంద్రబాబు ప్రకటన చేసినా ఆమెలో స్పందన కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయిన తర్వాత కూడా ఆమెలో కదలిక కనిపించడం లేదు. దాంతో ఆమెకు ఆసక్తి లేదనే వాదన వినిపిస్తోంది. ఆమెను అంగీకరింపజేసేందుకు టీడీపీకి చెందిన కొందరు నేతలు రంగంలో దిగారు. చివరకు ఆమె ఎలా స్పందిస్తారన్న దానిని బట్టి తిరుపతిలో టీడీపీ భవితవ్యం ఉంటుంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఇద్దరు ముగ్గురు నేతలు ఆసక్తి చూపారు. అయితే గట్టిగా ప్రయత్నం చేసిన వారు మాత్రం కనిపించలేదు. దాంతో అసలు టీడీపీ పోటీలో ఉంటుందా లేదా అనే చర్చ కూడా సాగింది. చివరకు చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనబాక లక్ష్మిని ఫైనల్ చేసినట్టు తేల్చేశారు. తీరా చూస్తే ఆమె ఇప్పటి వరకూ కనీసం తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పిన దాఖలాలు లేవు. వారం క్రితమే ఆమె ఖారరాయినప్పటికీ తిరుపతిలో కనిపించడం లేదు. దాంతో ఆమె తీరు పట్ల చర్చ మొదలయ్యింది.

తొలుత కొందరు పనబాక లక్ష్మిని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. గడిచిన ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాయకురాలిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయం సరికాదని సోషల్ మీడియాలోనే పలువురు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పరిశీలించిన పనబాక పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. అవకాశాలు లేని తిరుపతిలో అనవసరంగా చేతులు కాల్చుకోవడం అవసరమా అని ఆమె భావిస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి పనబాక లక్ష్మి గతంలో కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి వరకూ ఎదిగారు. కానీ 2014 ఫలితాల తర్వాత టీడీపీలో చేరి వరుసగా రెండు సార్లు ప్రయత్నాలు చేసినా ఆమెకు మళ్లీ పార్లమెంట్ యోగ్యం దక్కడం లేదు. దాంతో ఈసారి తిరుపతి బరిలో చివరకు ఆమె తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే. నిజంగా ఆమె పోటీకి దూరం అంటే మాత్రం అది టీడీపీకి పెద్ద తలనొప్పి అవుతుంది. అభ్యర్థిని మార్చాల్సిన స్థితి వస్తే ఆపార్టీ చేతులెత్తేసినట్టుగానే భావించాలి.

Show comments