Idream media
Idream media
అమెజాన్ Primeలో ఛాలాంగ్ ( jump ) ఈ మధ్య వచ్చింది. నిర్మాతల్లో అజయ్ దేవగన్ ఒకరు. sports నేపథ్యంలో వచ్చిన ఇంకో సినిమా ఇది. ఒక డ్రిల్లు మాస్టర్ (పీఈటీ) కథ ఇది.
చిన్నప్పుడు డ్రిల్లు అంటే ఒక యాతన. మా స్కూల్లో గ్రౌండ్ వుండేది కానీ శుభ్రంగా వుండేది కాదు. ఇద్దరు అయ్యవార్లు వున్నా వాళ్లు నేర్పించేదేమీ లేదు. వారానికి ఓ రోజు గ్రౌండ్‌లో పరిగెత్తించేవాళ్లు. నేను ఆ క్లాస్‌ని కూడా ఎగ్గొట్టి హిందీ సినిమా మ్యాట్నీకి వెళ్లేవాన్ని. ఆ రోజుల్లో వ్యాయామం ఎంత విలువైందో మాకు తెలీదు, మా అమ్మానాన్నలకి అస్సలు తెలీదు. ఏదో టైమ్ పాస్ చేసి జీతం తీసుకోవడం, రెండుమూడు టీంలు తయారు చేసి జిల్లా పోటీలకి తీసుకెళ్లి ఒకటో రెండో కప్పులు గెలవడం అంతకు మించి తెలీదు. అందరూ గవర్నమెంట్ స్కూళ్లలో చదవాల్సిన వాళ్లే కాబట్టి సహజంగానే డబ్బున్న పిల్లలకి ప్రయారిటీ వుండదు. నాలాంటి వాళ్లకి ఆసక్తి వున్నా, గ్రౌండ్‌లో గడ్డి పీకాల్సిందే.
ఈ సినిమాలో సాగతీత ఎక్కువున్నా రెండు మంచి పాయింట్స్ వున్నాయి. ప్రేమికుల రోజు నాడు పార్కుల్లో జంటలను అడ్డుకునే హక్కు మన సాంస్కృతిక దళాలకి ఎవరిచ్చారు? ఇది హీరోయిన్ ప్రశ్న.
హీరోయిన్ అమ్మానాన్నలు పార్కులో వుంటే హీరో దళ సభ్యుడిగా వాళ్లని అవమానిస్తాడు. హీరోయిన్‌ని ప్రేమించాలనుకున్నప్పుడు ఇది అడ్డంకి.
ఇంకో పాయింట్ ఏమంటే చిన్నవూళ్లలో డ్రిల్ మాస్టర్ల సోమరితనం తల్లితండ్రుల పట్టించుకోనితనం వల్ల పిల్లలకి ప్రతిభ వున్నా అది పనికి రాకుండా పోతోంది.
హీరో డ్రిల్ మాస్టర్, సోమరి. హీరోయిన్ కంప్యూటర్ టీచర్ లవ్‌లో పడతాడు. ఆ స్కూల్‌కి ఇంకో డ్రిల్ మాస్టరొస్తాడు. ఆయన పిల్లల్ని ప్రోత్సహిస్తాడు. హీరోని ఆయన కింద అసిస్టెంట్‌గా వేస్తారు. దాంతో హీరోకి కోపమొచ్చి కొత్త మాస్టర్‌తో సమానంగా తానూ పిల్లల్ని తయారు చేస్తానని బాస్కెట్‌బాల్, కబడ్డీ, రన్నింగ్‌లో పోటీలు పెట్టాలని సవాల్ చేస్తాడు.
చివరి అరగంట ఈ పోటీలు నడిచి హీరో గెలుస్తాడు. స్క్రీన్‌ప్లేలో లోపం ఏమంటే హీరో గెలుపులో ఎమోషన్ లేదు. లగాన్‌లో పేద రైతులు గెలవాలని బలంగా కోరుకుంటాం. గెలిచినపుడు కన్నీళ్లు పెట్టుకుంటాం. దంగల్‌లో అమీర్‌ఖాన్ వైపు వుంటాం. మన అమ్మాయి గెలిచినట్టుగా ఫీలవుతాం.
మంచి చెడు సినిమాలో వున్నపుడు మనం మంచి వైపు వుండి చెడుని వ్యతిరేకిస్తాం. దీంట్లో హీరో మంచివాడు కాదు. విలన్ చెడ్డవాడు కాదు. అందువల్ల గెలుపు ఓటములను ఫీల్ కాలేం.
అయితే సినిమా సరదాగా వుంటుంది. సెటైర్లు, పంచ్‌లు నడుస్తూ వుంటాయి. రాజ్‌కుమార్‌రావు అద్భుత నటుడు. సపోర్టింగ్‌గా సౌరభ్ శుక్లా కథలో విషయం వుంటే అదరగొడతారు. అది లేకపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదు. హీరోయిన్‌గా నుస్తత్ బరుచా ok.
జనవరిలో విడుదల కావాల్సిన సినిమా కరోనాతో ఆగిపోయింది. చివరికి అమెజాన్‌లో వచ్చింది. థియేటర్ కంటే ottనే కరెక్ట్.