చరిత్రహీనుడిగా మిగలదల్చుకోలేదు

  • Published - 07:18 AM, Thu - 26 December 19
చరిత్రహీనుడిగా మిగలదల్చుకోలేదు

టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ విశాఖ అర్బన్‌ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తూ చంద్రబాబుపై పలు విమర్శలు చేసారు.

ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయడం తమకు ఆనందం కలిగించిందని కానీ ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని రెహమాన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు మైనార్టీలంతా రుణపడి ఉన్నామని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని చంద్రబాబుని ప్రశ్నించారు.

చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు తాము దూరమయ్యామని రెహమాన్ తెలిపారు. విశాఖ కార్పొరేషన్ కు నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడేది లేదని స్పష్టం చేసారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చంద్రబాబు విధానాల పట్ల కార్యకర్తలు సంతోషంగా లేరని,కొంతమంది నాయకులు మాత్రమే చంద్రబాబు పాలనలో బాగు పడ్డారని చంద్రబాబుని విమర్శించారు.

విశాఖను రాజధానిగా చేయాలని తాము గతంలోనే పోరాటాలు చేశామని గుర్తు చేసారు. విశాఖ ప్రాంతం రాజధాని కావాలనేది ఆ ప్రాంత వాసుల కలగా రెహమాన్ చెప్పుకొచ్చారు. తప్పుడు రాజకీయాలను చేయవద్దని చంద్రబాబుకు హితవు పలుకుతూ, రైతులతో రాజకీయం చేయొద్దని చంద్రబాబును విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు ఎన్నార్సి బిల్లు కారణంగా అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు. ఎన్నార్సీ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు స్పందించని కారణంగా విశాఖ అర్బన్‌ టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రెహమాన్ ప్రకటించారు. చరిత్రలో హీనంగా మిగలాలని అనుకోవడం లేదని అందుకే చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని చంద్రబాబుపై విమర్శలు కురిపించారు.

Show comments