‘‘మీ ఏడుపులే.. మాకు దీవెనలు’’ అంటున్నారట

వాహనం ఏదైనాగానీ దాని వెనకాల కాప్షన్‌ చటుక్కున గుచ్చుకునేలా ఉంటుంటాయి. అందులో ‘మీ ఏడుపులో మాకు దీవెనలు’ అనే కేప్షన్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడీ కేప్షన్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు తగిలించుకోవాలనుకుంటున్నారట. అదేంటి నాయకులెందుకు తగిలించుకోవాలనుకోవాలనుకుంటారు? అన్న సందేహం కలిగినప్పటికీ ప్రస్తుతం అధికార వైఎస్సార్‌సీపీలో ఇదే చర్చ జరుగుతోందంటున్నారు.

రాష్ట్రంలో దాదాపు అన్ని బీసీ కులాలు, ఉప కులాలకు సైతం చైర్మన్‌లను సీయం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాధాన్యంలేని ఎన్నో కులాలకు కూడా ఇప్పుడు ఛైర్మన్‌లు నియమించబడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ తరహా విధానం ఏపీలోనే ప్రథమంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇలా నియమించడం ద్వారా ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించడమే జగన్‌ లక్ష్యంగా అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. ఛైర్మన్‌ల పని విధివిధానాలకు సంబంధించిన లోతైన కసరత్తే జరుగుతుందంటున్నారు.

అయితే ఈ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల గురించి అప్పుడే ప్రతిపక్ష పార్టీలో విమర్శలకు సిద్ధమైపోయాయి. అలా ప్రకటించారో? లేదో? అప్పుడే ప్రతిపక్షనాయకులు, వారి అనుంగు మీడియాలు స్పెషల్‌ స్టోరీలు, డిబేట్లు.. ప్రారంభించేసాయి. చూసే వారికి ఇది కొంచెం అతిగానే అన్పిస్తున్నప్పటికీ వారి ధోరణిలో వారు మాత్రం కార్పొరేషన్లను చిన్నబుచ్చే కార్యక్రమానికి తెరలేపేసాయి. కార్పొరేషన్‌ ఛైర్మన్‌లను ప్రకటించడాన్ని చిన్నబుచ్చే విధంగానే ఈ డిబేట్లు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం సీయం వైఎస్‌ జగన్‌ అనుసరిస్తున్న విధానాలు సరికొత్తవి. ఇందులో లోటుపాట్లు ఉంటే వాటిని గుర్తించి వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన అనేక వ్యవస్థలు అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా పలు ప్రభుత్వ సేవలు వెనువెంటనే అందడాన్ని ప్రజలు ఇప్పటికే స్వయంగా చూసారు. అలాగే కోవిడ్‌ విపత్తులో వాలంటీర్లు అందించిన సేవలు ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కొనియాడుతూనే ఉన్నారు. ఇలా ఒక్కో వ్యవస్థ తనదైన ప్రత్యేకశైలిలో పనిచేస్తోంది. వీరి అంతిమ లక్ష్యం ప్రజలకు మెరుగైన, సులభతరమైన ప్రభుత్వ సేవలు విస్తృతంగా అందించడమే.

ఇదే క్రమంలో బీసీ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ఛైర్మన్‌లను ఏర్పాటు చేసి, ఆయా వర్గాలు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయించారు. దీనిని ‘పచ్చ’ కళ్ళతో చూసేవారు తప్పితే దేశ వ్యాప్తంగా అభినందనలు లభిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా బురదజల్లడమే మా అజెండా అన్న రీతిలో ప్రతిపక్ష నాయకులు, మీడియా పనిగట్టుకుని మైకులందుకోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నెగెటివ్‌ ప్రచారం వల్ల వాళ్ళకు ప్రత్యకంగా ఊడిపడేదేం లేదని, వారు అలా ఏడ్చే కొద్దీ తమలో కసిపెరుగుతోందంటున్నారు అధికార పార్టీ నాయకులు. మరింత మెరుగ్గా పనిచేసి ప్రజల మెప్పును పొందడం ద్వారా సీయం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show comments