సూర్య లాజిక్ తో కొడుతున్నాడు

మనకూ బాగా సుపరిచితుడైన హీరో సూర్య మీద తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు నషాళానికి అంటిన కోపంతో రగిలిపోతున్నారు. తాము ఎంత బెదిరించినా తగ్గకుండా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన పొన్మగళ్ వందాల్ ని ఓటిటిలో రిలీజ్ చేయబోతుండటమే దీనికి కారణమన్న సంగతి తెలిసిందే. ఇకపై భవిష్యత్తులో సూర్య సినిమాలేవీ థియేటర్లలో విడుదల కానివ్వబోమని అల్టిమేటమ్ జారీ చేశారు పంపిణిదారులు. అయితే సూర్య దీనికి ఏ మాత్రం చలించడం లేదు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సూర్య సహనం కోల్పోయి తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నాడు.

ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌసుల ద్వారా 70 కోట్ల పెట్టుబడి ఇరుక్కుపోయిందని ఇప్పుడు తన మీద నిందలేస్తున్న వారెవరైనా అది ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తన సినిమాలకు విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఎవరూ అదనంగా ఇవ్వరని అలాగే నష్టాలు వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోరని ఇక్కడ ఎవరి యుద్ధం వారే చేయాలని అందుకే ఓటిటి వైపు వెళ్ళాల్సి వచ్చిందని స్పష్టంగా చెబుతున్నారు. అంతే కాదు సూర్య మాటలను బట్టి చూస్తుంటే ఆకాశమే నీ హద్దురా మూవీని సైతం ఇలాగే డిజిటల్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇప్పుడు సూర్యకు కోలీవుడ్ లో 30కి పైగా ప్రొడ్యూసర్ల మద్దతు ఉంది. ఇంకొందరు తోడయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ఎగ్జిబిటర్లు మరీ పంతానికి పోయి థియేటర్లు తెరిచాక సూర్య సినిమాలు బ్యాన్ చేస్తే వీళ్ళంతా ఒక్కటైపోయి రివర్స్ షాక్ ఇవ్వడం ఖాయం. ఇప్పటికే ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. అయిదారు తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో సహా ఓటిటిలో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. సూర్య అడుగుతున్న లాజిక్స్ కు సోషల్ మీడియాలో సైతం మంచి మద్దతు దక్కుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లోనూ దీని తాలుకు ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయి. మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు ఈ డిజిటల్ పరిణామాల పట్ల చాలా సీరియస్ గా ఉన్నాయి. సూర్య తరహాలో మరికొందరు సైతం తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా వీడియో స్ట్రీమింగ్ సంస్థలు మాత్రం ఈ పరిణామాలను ఫుల్ గా వాడుకుంటున్నాయి

Show comments