Idream media
Idream media
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా భారత సీనియర్ ఆల్‌రౌండర్ సురేష్ రైనా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే రైనా మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 164 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా,మిగిలిన మ్యాచ్‌లు ప్రస్తుతం ఐపీఎల్ లో ఉనికిలో లేని కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో కొచ్చి టస్కర్స్ జట్టుకు రైనా నాయకత్వం కూడా వహించాడు. 2016,2017 ఐపీఎల్ సీజన్‌లలో నిషేధానికి గురైన CSK, రాజస్థాన్ రాయల్స్ స్థానాలలో కొచ్చి టస్కర్స్, పూణే వారియర్స్ ప్రాంఛైజీలు ఆడాయి.
ఐపీఎల్ టోర్నీలో సురేష్ రైనా తర్వాత భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ 190 మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో CSK మొత్తం 165 మ్యాచ్‌లు ఆడగా ఆ జట్టు కెప్టెన్ ధోనీ 160 మ్యాచ్‌లలో బరిలో దిగాడు.అతని కంటే రైనా నాలుగు ఎక్కువగా 164 మ్యాచ్‌లు ఆడడం విశేషం.
ఇక అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాలలో రోహిత్ శర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) ఉన్నారు.2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 12 సీజన్‌లు పూర్తిచేసుకుంది. అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్-2020 సీజన్ నిరవధిక వాయిదా పడటంతో ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 2006లో టీ-20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా 78 టీ20 మ్యాచ్‌లు ఆడి 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. భారత్ తరఫున సురేశ్ రైనా 18 టెస్టులలో 26.18 సగటుతో 7 అర్థసెంచరీలు, ఒక సెంచరీతో మొత్తం 768 పరుగులు చేయగా, 226 వన్డేలలో 36 అర్థసెంచరీలు, 5 సెంచరీలతో 5615 పరుగులు సాధించాడు.
ఇక గత 2018 జూలై 17 న ఇంగ్లీష్ గడ్డపై చివరిసారిగా ఇంగ్లాండ్‌తో వన్డే ఆడిన రైనా ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.రీ-ఎంట్రీ కోసం తపిస్తున్న రైనా ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబర్, నవంబర్ మాసాలలో జరగనున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ బరిలో దిగే భారత జట్టులో స్థానాన్ని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.