దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?

అచేతన స్థితిగతులను తొలగించగల శక్తి కళలకుంది అంటారు. అందులో ప్రత్యేకమైనది హరికథ. సాహిత్యం, సంగీతం, నాట్యం, హాస్యం, భక్తి, అభినయం తదితర కళల సమాహారం హరికథ. జగద్విఖ్యాతిగాంచిన ఆదిభట్ల నారాయణదాసు దీనికి పితామహుడు. ఆ కళను ప్రపంచ వ్యాపితం చేయడంలో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని హరికథ పాఠశాల చేసిన కృషి ఎన్నదగినది. ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు, రాజరాజేశ్వరమ్మ స్థాపించిన శ్రీసర్వారాయ హరికథా పాఠశాల చేసిన కృషి అసామాన్యం. కథలు కంచికి చేరతాయంటారు. కాని ఇక్కడ శిక్షణ పొందినవారు చెప్పిన కథలు మనసుల్లోకి చేరి మన జీవితంలో ఒక చోదక శక్తిగా పనిచేస్తాయి.

నేపథ్యమిదీ..

చంటిదొరగా పేరుగాంచిన కపిలేశ్వరపురం జమీందారు, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు, రాజరాజేశ్వరమ్మలు శ్రీ సర్వారాయ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు పేరున కపిలేశ్వరపురంలో 1973 జూన్‌10న శ్రీసర్వారాయ హరికథా పాఠశాలను స్థాపించారు. ముద్రణాలయం కూడా ఏర్పాటుచేసి పురాతన గ్రంథాలను ముద్రించి సాహిత్య కృషి చేశారు.

దేశంలోనే ఇది మొదటిది..

హరికథను కేవలం ఆంధ్రాకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న సత్యనారాయణరావు చిరకాల కోరిక నుంచి పుట్టుకొచ్చిందే సంస్కృతంలో హరికథ బోధన. దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఇది. తెలుగుకు పరిమితమైన హరికథను సంస్కృతంలో నేర్పించడం, నేర్చుకున్న విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పాఠశాల ప్రత్యేకత.

Also Read : కాటమరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా..?

చక్కటి వాతావరణంలో బోధన..

గోదావరి తీరంలో అలరించే వాతావరణంలో ఈ పాఠశాల ఉంది. నాలుగు సంవత్సరాల కోర్సులో సుమారు 10 కథలను నేర్పుతారు. తెలుగు, సంస్కృతం, సంగీతం, వయోలిన్, మృదంగం, నృత్యం ఉపాధ్యాయులు బోధిస్తారు. ఆంధ్రా, కూచిపూడి నృత్యం రెండూ నేర్పుతారు. పాఠశాలలోని దేవగృహలో ఉదయం 8 గంటలకల్లా పూజా కార్యక్రమాలు పూర్తిచేస్తారు. అక్కడ నుంచి పదకొండున్నర వరకూ, తరువాత మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకూ పాఠాలు చెబుతూ సాధన చేయిస్తారు. విద్యార్థులకు ఉచిత విద్య, భోజన, వసతి, వైద్య, వస్త్ర సదుపాయాలతో పాటు నెలకు రూ.800 చొప్పున సంవత్సరానికి రూ.9,600 స్టైఫండ్‌ అందజేస్తారు. కోర్సు పూర్తయ్యాక హరికథా గాన ప్రవీణ సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఉపాధి ఇలా..

కోర్సు పూర్తి చేసుకున్నవారు భాగవతార్లుగానో, సంగీతం, నాట్యం టీచర్లుగానో జీవనోపాధి పొందుతున్నారు. కార్పొరేట్‌ విద్యాలయాల్లోనూ, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టులకు చెందిన దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. రేడియో, టీవీ ఆర్టిస్టులుగా ఎదిగిన వారూ ఉన్నారు. ఇక్కడ నేర్చిన విద్యను జపాన్‌ రష్యా, ఇంగ్లండ్, వంటి విదేశాల్లోనూ, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి చోట్ల ప్రదర్శించినవారు ఉన్నారు. ఇక్కడి పూర్వపు విద్యార్థిని దాలిపర్తి ఉమామహేశ్వరి వివేకానందుడు చికాగోలో ప్రసంగించిన వేదికపై, హైదరాబాద్‌లో 1978లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమక్షంలో కథాగానం చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలకు వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది.

Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

Show comments