ఫైటింగ్ లు చేయ‌ని శోభ‌న్‌బాబు

మార్చి 20, శోభ‌న్‌బాబు వ‌ర్ధంతి. ఆయ‌న విచిత్రమైన న‌టుడు. గొప్ప‌గా న‌టించిన సినిమా ఒక‌టి కూడా గుర్తు లేదు. చెత్త‌గా చేసిన సినిమా కూడా గుర్తు లేదు. నేనెప్పుడూ ఆయ‌న అభిమాని కాదు. కానీ ప్ర‌తి సినిమా చూశాను. ఊహ తెలిసేసరికి NTR, ANR మాత్ర‌మే హీరోలు. కృష్ణ‌, శోభ‌న్‌లు చిన్న సినిమాలు చేస్తూ పెద్ద హీరోల‌కి త‌మ్ముళ్లుగా న‌టించేవాళ్లు.

మొద‌టిసారి శోభ‌న్ పేరు విన్న‌ది మ‌నుషులు మారాలి సినిమాతో. దాంట్లో … హీరో. కానీ శోభ‌న్ కూడా వుంటాడు. ఈ సినిమాకి ఆడ‌వాళ్ల బెంచీలో…..నేను తెగ ఏడ్చాను. దీని గొప్పత‌నం ఏమంటే రేడియోలో శ‌బ్ధ చిత్రం విని కూడా ఏడ్చేవాళ్లు.

త‌ర్వాత చూసింది తాసిల్దార్‌గారి అమ్మాయి. ఇగో స‌మ‌స్య‌ల‌తో భార్యాభ‌ర్త‌లు విడిపోవ‌డం ఆ రోజుల్లో కొత్త స‌బ్జెక్ట్‌. సింగిల్ ప్రొజెక్ట‌ర్ వున్న ….థియేట‌ర్‌కి వ‌చ్చి దోమ‌ల‌తో కుట్టించుకుంటూ చూశాను.

“క‌న‌ప‌డ‌ని చెయ్యి కాదు, న‌డిపేది నాట‌కం
క‌నిపిస్తూ నువ్వూనేనూ ఆడుతాం భూట‌కం”

ఈ పాట మోహ‌న‌రాజు పాడాడు. ఆత్రేయ రాశాడు. జీవితాంతం గుర్తుండిపోయింది. సంక్లిష్ట స‌మ‌యాల్లో ఎన్నోసార్లు పాడుకున్నాను.

శోభ‌న్‌బాబు అంటే ఎందుకు అయిష్ట‌మంటే ఫైటింగ్‌లు చేయ‌డు. సినిమా స్టార్ట్ కాగానే టైటిల్స్‌లో స్టంట్స్ అని లేక‌పోతే ఊసురోమ‌ని వ‌చ్చేసేవాన్ని. కృష్ణ సినిమాలైతే టైటిల్స్ చూడ‌క్క‌ర్లేదు. మూతి బిగించి, ఎడ‌మ చేత్లో ఉత‌క‌డంతోనే సినిమా స్టార్ట్ అయ్యేది. కొంచెం సాఫ్ట్‌కార్న‌ర్ ఏర్ప‌డింది శార‌ద సినిమాతో. త‌న‌ని భ‌ర్త‌గా భ్ర‌మిస్తున్న మ‌తిచెడిన అమ్మాయితో ప్ర‌వ‌ర్తించిన ప‌ద్ధ‌తి శోభ‌న్‌పైన గౌర‌వం పెంచింది. త‌ర్వాత జీవ‌న‌జ్యోతి, జేబుదొంగ వ‌చ్చాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా చూసేవాన్ని. కానీ  NTR సినిమాల్లో ఫ‌స్ట్ మార్నింగ్ షోకి వెళ్లి చొక్కాలు చించుకుంది ఏనాడూ లేదు. సంపూర్ణ రామాయ‌ణంలో రాముడిగా ఎంత బాగుంటాడంటే చెప్ప‌లేం. ద‌శ‌ర‌థుడిగా గుమ్మ‌డి, రాముడిల మ‌ధ్య బాపు తీసిన సీన్ అద్భుతం.

అవ‌కాశం వ‌స్తే పౌరాణికాల్లో  NTRని మ‌రిపిస్తాడేమో అనిపించింది. కానీ ఇది శోభ‌న్ గొప్ప‌త‌నం కాదు, బాపుద‌ని త‌ర్వాత తెలిసింది. కురుక్షేత్రంలో కృష్ణుడిగా శోభ‌న్ …మ‌రింత స్ప‌ష్ట‌మైంది.

డాక్ట‌ర్ బాబు సినిమాని ధ‌ర్మ‌వ‌రం ప‌ద్మ‌శ్రీ టాకీస్‌లో వ‌రుస‌గా రెండుసార్లు చూశాను. టాకీస్ బ‌య‌ట ఒకాయ‌న అద్భుత‌మైన బొరుగుల మిక్చ‌ర్‌ అమ్మేవాడు. దానికోసం వెళ్లి ఈ సినిమాని చూశాను. జ‌య‌ల‌లిత, శోభ‌న్‌ల కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌ల‌తో కొత్త త‌రం ప్రారంభ‌మైన‌ప్పుడు శోభ‌న్ గౌర‌వంగా త‌ప్పుకున్నాడు. ప‌రుగు ఆప‌డం ఒక క‌ళ‌. ఇది ఆయ‌న పుస్త‌కం పేరు. త‌ర్వాత పెద్ద‌గా న్యూస్‌లో లేరు.

2004లో న‌వ్య వీక్లీ ప‌ని చేస్తున్న‌ప్పుడు బాబూరావు అన్న‌య్య వ‌రుస‌గా ప్ర‌తి వారం పాత సినిమాల‌పై అద్భుత‌మైన వ్యాసాలు రాసేవాడు. ఆ సంద‌ర్భంగా శోభ‌న్‌తో ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ వేయ‌డం మ‌రిచిపోలేని విష‌యం.

ఒక‌రోజు నిద్ర‌లేచే స‌రికి ఆయ‌న లేరు. బాధ‌గా టీవీ ముందు కూచుండిపోయాను. ఆయ‌న ఇంట్లో రిపోర్ట్ చేస్తున్న విలేక‌రిని చూసి ఇంకా బాధేసింది. అత‌నికి సినిమాలు చూసే అల‌వాటు లేదు. వ్య‌క్తిగ‌తంగా నాకు తెలిసినవాడు. శోభ‌న్ గురించి నోటికొచ్చింది చెబుతున్నాడు. జ‌ర్న‌లిజంలో ఇదో దౌర్భాగ్యం. సినిమా న‌టులంటే తెర‌మీద మాత్ర‌మే క‌నిపించ‌రు. వెతికి చూస్తే మ‌నగుండెల్లో కూడా వుంటారు.

మ‌ద్రాస్‌లో శోభ‌న్‌బాబు విగ్ర‌హం వుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డుందో నాకు తెలియ‌దు.

Show comments