iDreamPost
iDreamPost
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ అందరికీ సుపరిచితుడు. కానీ అంతకుముందు ఆయన పార్టీ సీపీఎంకి కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం వచ్చిన సమయంలో జ్యోతిబసు ప్రధాని కాకుండా అడ్డుకున్న నేతల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఆయన. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో దేవెగౌడ ప్రభుత్వం పతనంతో రాజకీయంగా అస్తిరత ఏర్పడింది. ఆ సమయంలో సీపీఎం తరుపున సీనియర్ సీఎంగా ఉన్న జ్యోతిబసుని పీఎం చేయాలని పలువురు పట్టుబట్టారు. వివిధ పక్షాల నుంచి సానుకూల సంకేతాలు కూడా వచ్చాయి. జ్యోతిబసు కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. కానీ తీరా ఆయన సొంత పార్టీ మాత్రం అడ్డుపుల్ల వేసింది. అందులో ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న సీతారం ఏచూరి, ప్రకాష్ కరత్ లదే కీలకపాత్ర. అప్పట్లో కార్యదర్శిగా ఉన్న హరికిషన్ సింగ్ సూర్జీత్ వంటి వారి మాట కూడా చెల్లుబాటు కాకుండా మెజార్టీ నేతల నిర్ణయం పేరుతో ఆ అవకాశాన్ని దూరం చేసుకున్న చరిత్ర ఉంది. దానిని “చారిత్రక తప్పిదం” అంటూ ఆ తర్వాత జ్యోతిబసు బాహాటంగా పేర్కొన్న విషయం చాలామందికి తెలుసు.
అప్పట్లో ప్రధానమంత్రి పదవి కూడా వద్దని చెప్పిన పార్టీ నేతల్లో ఒకరిగా ఉన్న ఏచూరి ఇప్పుడు మాత్రం రాజ్యసభ సీటు కూడా కోసం ప్రయాసపడడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఏపీకి చెందిన నేత అయినప్పటికీ ఆయన పార్టీకి బలం ఉన్న బెంగాల్ నుంచి రెండుసార్లు అవకాశం దక్కించుకున్నారు. అంతటితో సంతృప్తి చెందకుండా ఇప్పుడు మూడో సారి కూడా ఎగువ సభలో అడుగుపెట్టాలని ఆయన భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది . జోడు పదవుల విషయాన్ని ఒకనాడు పెద్ద వివాదంగా మార్చిన నేతలు ఇప్పుడు పార్టీ సారధిగా ఉండగానే , పార్లమెంటరీ పదవుల కోసం ప్రయత్నించడం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీపీఎం అనేక సమస్యల్లో కనిపిస్తోంది. అదే సమయంలో యువనాయకత్వం గురించి చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు కొత్త నేతలను ప్రోత్సహించడానికి బదులుగా మళ్లీ ఏచూరి ఎందుకు సిద్ధపడుతున్నారన్నది చాలామందికి అంతుబట్టడం లేదు.
పశ్చిమ బెంగాల్ లో ఈసారి రాజ్యసభకు నేరుగా సీపీఎం గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ మద్ధతు తీసుకోవాల్సిందే. అంటే కేరళలో తాము పోరాడుతున్న కాంగ్రెస్ తో బెంగాల్ లో స్నేహం ఆపార్టీకి కొంత ఇబ్బందికరమే. అందులోనూ త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అలాంటి సమయంలో సీతారాం ఏచూరి ప్రయత్నాలకు ఆపార్టీ పోలిట్ బ్యూరో కూడా ససేమీరా అంటున్నట్టు కథనాలు వస్తున్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలిసి సాగాలన్న ఏచూరి ఆలోచనకు హైదరాబాద్ మహాసభలో బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ సహాయంతో రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆతృతపడిన సీతారాంకి పార్టీ నుంచి నిరాశ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.
రాజకీయంగా పార్టీ ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఏచూరీ కూడా పార్లమెంటరీ పదవుల కోసం ఆశపడటం మాటలకు, చేతలకు పొంతన లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో తాను అనుభవించిన పదవుల కోసం ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు చేయడం ఆయన స్థాయికి తగదని చెబుతున్నారు. ఒకనాడు ప్రధాని పదవిని కూడా కాదని తోసిపుచ్చిన నేతలే ఇప్పుడు ఒక్క ఎంపీ సీటు కోసం పోటీ పడడం గమనిస్తే సీపీఎం పయనం ఏ దిశలో ఉందనే విషయాన్ని చాటుతోందని అభిప్రాయపడుతున్నారు.