Idream media
Idream media
శివరాత్రి మరుసటి రోజు మన హక్కేమిటంటే స్కూల్లో నిద్రపోవచ్చు. ఇపుడైతే ఆప్షనల్ కింద సెలవు ఇచ్చేస్తున్నారు. అప్పట్లో లేదు. సగం మంది వచ్చేవాళ్లు కాదు. వచ్చిన వాళ్లు నిద్రపోయేవాళ్లు. అయ్యవార్లు కూడా ఏమీ అనేవాళ్లు కాదు. వాళ్లూ తూగేవాళ్లు.
కొంత మంది వీరభక్తులు నిద్రపోయే వాళ్లు కాదు. జాగారం పుణ్యం దక్కాలంటే మరుసటి రోజు చంద్రున్ని చూసి నిద్రపోవాలట. శివుడంటే చిన్నప్పుడు బాగా ఇష్టం. సినిమాల్లో వరాలు ఇచ్చేవాడు, డ్యాన్స్ చేసే దేవుడు ఆయనొక్కడే. ఏదో ఒక రోజు శివుడు కనిపించి చదువు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మేవాన్ని. ఇంకా కనపడలేదు. ఒకవేళ కనపడినా అది చెప్పడానికి మనం ఉండమేమో! లయకారుడు కదా.
రాయదుర్గంలో శివభక్తులెక్కువ. కర్నాటక ప్రభావం. లింగాయత్‌లు ఎక్కువ. నడుముకి శివ లింగం ధరించే వాళ్లు. నుదుటి మీదే కాదు, కొంత మంది ఒళ్లంతా అడ్డంగా శివనామాలు వేసుకునే వాళ్లు. నాలుగో తరగతిలో శంకరయ్య అనే అయ్యవారికి ఎప్పుడూ నుదుట విభూతి రాలుతూ ఉండేది. మాటకి ముందు శివశివా అనేవాడు. బెత్తంతో కొడితే కైలాసం కనపడేది. పిల్లల్ని మూడో కంటితో చూసేవాడు.
పగటి వేషగాళ్లు శివుడిగా వచ్చేవాళ్లు. వాళ్ల వెంటే తిరిగేవాన్ని. చంకలో ఏదో పైప్ పెట్టుకుని నెత్తమీద ఉన్న గంగ నుంచి నీళ్లు వదిలేవాడు. ఆ ట్రిక్ పిల్లలకి వింతగా, విచిత్రంగా ఉండేది. భస్మాసురుడి కథ చదివినప్పుడు ఎందుకంత భోళాగా ఉంటాడో అర్థమయ్యేది కాదు. పొగడ్తలంతే శివయ్యకే కాదు, అందరికీ ఇష్టమే. కాకపోతే పొగిడించుకుంటారు, వరాలివ్వరు.
పౌరాణిక సినిమాలో శివుడు తక్కువ కనిపించేవాడు. దక్షయజ్ఞం మాత్రం ఫుల్ లెంగ్త్ సినిమా. చిరంజీవి కూడా శివుడిగా వేశాడు కానీ, చిరంజీవే కనిపించాడు.
రాయదుర్గం పాలెగాండ్ల పాలనలో వుండేది కాబట్టి , పురాతనమైన గుళ్లు చాలా ఉండేవి. శివరాత్రి సాయంత్రం జట్కా బండిలో కోటలో ఉన్న శివాలయానికి వెళ్లేవాళ్లం. వడ పప్పు, పానకం ఇచ్చేవాళ్లు. మూడో తరగతి అయ్యవారు రామ్మూర్తి, ఆ గుళ్లో పూజారిగా కూడా ఉండేవాడు. అప్పటికే పార్ట్ టైం ఉంది. మున్సిపాలిటీలో జీతాలు సరిగా ఇవ్వని కాలం.
Also Read : కోటప్పకొండ మహాశివరాత్రి.. ప్రభల సంస్కృతీ వైభవం
జైల్లో ఉన్న ఖైదీలని ఒక రోజంతా స్వేచ్ఛగా వదిలేస్తే ఎంత ఆనందిస్తారో అంత సంతోషం శివరాత్రి నాడు పిల్లల్లో కనిపించేది. పాము పటాలు, బారాకట్ట, కుంటాట, దొంగాపోలీస్ అన్ని ఆటలూ విజృంభించేవి. పాము పటంలో అరుకాషుడు అనే పాముని చూస్తే భయం. అది తినిందంటే పైన్నుంచి కిందికి తేలుతాం. ఎక్కడ మొదలయ్యామో , అక్కడికే వస్తాం. పాము పటంలో తప్పించుకోవచ్చు గానీ, జీవితంలో అరుకాషుల్ని తప్పించుకోవడం కష్టమని అపుడు తెలియదు. ట్విస్ట్ ఏమంటే లైఫ్‌లో నిచ్చెనల రూపంలో పాములుంటాయి.
కొంచెం పెద్దయ్యాక సినిమా పిచ్చి పట్టుకుంది. ప్యాలెస్, అజీజియా అని రెండు అభిమాన థియేటర్లు ఉండేవి. ఇవి కాకుండా ప్రేక్షకులపైన ఏ మాత్రం అభిమానం లేని జయలక్ష్మి అనే టెంట్ కూడా ఉండేది. వీటిలో ఒక షో చూడడమే కష్టం. వరుసగా రాత్రంతా 3 సినిమాలు ఏ రకంగా చూసేవాళ్లమే తెలియదు.
ఇళ్లలో , గుళ్లలో ఉన్న భక్తి చాలదని థియేటర్లలో కూడా భక్తి సినిమాలే వేసేవాళ్లు. ఒక శివరాత్రికి భక్తతుకారం చూశాను. ఏ కష్టం వచ్చినా ANR పాట ఎత్తుకుంటాడు. ఉన్నావా, అసలున్నావా అని పాడితే దేవుడు వచ్చేస్తాడు. పరీక్షల్లో పేపర్ కష్టంగా ఉన్నప్పుడు నేను ఇదే పాట పాడేవాన్ని. దేవుడికి బదులు ఎగ్జామినర్ కనిపించేవాడు.
ఫస్ట్ షోకి, సెకండ్ షోకి గ్యాప్ తక్కువగా ఉండేది. ప్యాలెస్‌లో ఫస్ట్ షో చూస్తే అజీజియా వరకూ సెకండ్ షోకి పరుగెత్తేవాళ్లం. మధ్యలో కుక్కలు వెంట పడేవి. వాటిని తప్పించుకుని వెళితే అక్కడ టికెట్ కౌంటర్ లోపలికి వెళితే బయటికి రాలేం. బయట ఉంటే లోపలికి వెళ్లలేం. ఎవడో ఒకడు ధైర్యంగా వెళ్లి జనం కాళ్ల సందుల్లో దూరి వచ్చేవాడు. లోపల బెంచీల నిండా జనం, లోపల సీట్లు ఎన్ని ఉన్నాయనేది అనవసరం. టికెట్లు ఇస్తూనే ఉంటారు. లోపల నీ చావు నీదే. ఎలాగోలా ఒంటి పిర్ర మీద కూచుంటే ఆ పిర్రకి కూడా నల్లులు కుట్టేవి.
రెండు షోల వరకూ OK కానీ, థర్డ్ షో నిద్రపోవడానికే వెళ్లేవాళ్లం. ఇంకొంచెం పెద్దయ్యాకా పేకాట. రాత్రింబవళ్లు ఆడినా ఎవడికీ 2 రూపాయలు వచ్చేవి కావు, పోయేవి కావు. ఇంకొంచెం పెద్దై ఉద్యోగం వచ్చాక జర్నలిజంలో నైట్ డ్యూటీలు మొదలై శివరాత్రి చూపించాయి ప్రతిరోజూ.
ఈ సారి శివరాత్రికి అమెరికాలో ఉన్నా. అలవాటు కొద్ది థియేటర్‌కు వెళ్లా. కానీ ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. నా లోపల ఒకడుండే వాడు. స్క్రీన్ మీద జరిగేదంతా నిజమని నమ్మే అమాయకుడు. నల్లులతో కుట్టించుకుంటూ, బీడీల పొగ మధ్య, కుయ్యోమని అరిచే ఫ్యాన్ సౌండ్‌తో కూడా సినిమా చూసి నవ్వేవాడు, ఏడ్చేవాడు. వాడు తప్పి పోయాడు. వెతుకుతున్నా, దొరకలేదు. దొరకడు కూడా.
Also Read : శ్రీశైల మల్లన్నకు తలపాగా విశిష్టత