iDreamPost
iDreamPost
ప్రజల ప్రాణాల కంటే మీకు పాపులారిటీనే ముఖ్యమా?.. చాలా కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన మీకు ప్రజల ప్రాణాల విలువ తెలియదా? అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో చంద్రబాబు, ఆయన పార్టీ నేతల నిర్లక్ష్యానికి కొందరు అమాయకులు బలైన సంగతి తెలిసిందే. తమ పార్టీ బలంగా ఉంది, తన సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న భ్రమలు కలిగించాలనే ఉద్దేశంతో కందుకూరులో ఇరుకు రోడ్డులో మీటింగ్ పెట్టి ఎనిమిది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఆ కుటుంబాల కన్నీటి తడి ఆరకముందే.. గుంటూరులో సంక్రాంతి కానుకలు ఆశ చూపి మరో ముగ్గురిని బలి తీసుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆవేదన చెందిన ఆర్జీవీ.. చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక నాయకుడికి ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు.
“పెద్ద గ్రౌండ్ లో సభలు పెడితే జనాలు రారేమో. దానివల్ల పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుంది అనే భయంతో ఇలా ఇరుకు ప్రదేశాల్లో పెడుతున్నారు. అయినా కూడా రారేమో అనే భయంతో కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు చంద్రబాబు కానుకల పేరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నిర్వహణ సరిగా లేదు. ఏదో పశువులకు దాణా వేసినట్టు విసిరారు. చంద్రబాబు ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారికి నా సూటి ప్రశ్న.. మూడు నాలుగు సార్లు సీఎం అయిన మీకు ప్రజల గురించి తెలీదా? ఏ చోట ఏం చేస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అవగాహన లేదా?. మీకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం. మీ దృష్టిలో ప్రజల ప్రాణాలు ప్రాణాలే కాదు. మీకు మీ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ఎంతమంది చనిపోతే, మీకు అంత పాపులారిటీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే దారుణమైనది ఇంకోటి ఉండదు.” అంటూ ఆర్జీవీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చేయాల్సింది అంతా చేసి, అది ఎవరో ఎన్ఆర్ఐ పెట్టాడు, నాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని వర్మ అన్నారు. 40-50 సంవత్సరాల అనుభవం ఉన్న మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలీదంటే ఎవరూ నమ్మరు అంటూ ఫైర్ అయ్యారు. మీకు ప్రజల ప్రాణాల కంటే పాపులారిటీనే ముఖ్యమని, మీకు అసలు ఎవరితో సంబంధం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేశారన్న రెస్పెక్ట్ తో ఇంతకాలం మీరు అని సంభోదించాను, కానీ ఈ సంఘటన వల్ల నువ్వు అనే సంభోదిస్తాను. నాయకుడు అనేవాడు ప్రజల క్షేమం కోరుకోవాలి. ప్రజల ప్రాణాలు బలి తీసుకొని పాపులారిటీ పొందాలనే ఆలోచన చాలా దారుణమైనది. హిట్లర్, ముస్సోలిని తర్వాత నిన్నే చూస్తున్నాను అంటూ చంద్రబాబు తీరుని ఆర్జీవీ తప్పుబట్టారు.