మహేష్‌బాబు మురారీ సినిమా షూటింగ్‌ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?

చరిత్రకు మౌనసాక్షిగా నిలిచిన ఈ కోట తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోనిది. దీనికి గొప్ప చరిత్ర ఉంది. 900 శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని కాలం నుంచి రామచంద్రపురం ప్రసిద్దికెక్కింది. రాజమహేంద్రవరంలో రాజరాజనరేంద్రుని కాలంలో రామచంద్రపురం ఆయనకు సబ్‌కోర్టుగా ఉండేదని చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో నేలమాళిగలో జైలును కూడా నిర్మించారు. ప్రస్తుతం ఉన్న కోటకు పరిసర ప్రాంతాలో ఈ నేలమాళిగల జైలు ఉన్నట్లు చెబుతున్నారు.

1420లో హైదరాబాద్‌లో కూలీకుతుబ్‌షా పాలన రాగా 1540లో షేర్‌మహ్మద్‌ను ఈ ప్రాంతానికి రెవెన్యూ అధికారిగా నియమించారు. దీంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఏలూరు ఎస్టేట్, మందపాటి వారి ఎస్టేట్, కోటిపల్లి ఎస్టేట్, పాయకేరావ్‌ ఎస్టేట్, కుమిలిభోగాపురం ఎస్టేట్, బొబ్బిలి ఎస్టేలుగా ఏర్పాటు చేసి షేర్‌ మహ్మద్‌కు కప్పాన్ని పంపించేవారు.

కోటిపల్లి ఎస్టేట్‌లో కాకర్లపూడి వంశీయులు

కె.గంగవరం మండలంలో గోదావరి తీరాన్ని అనుకుని ప్రస్తుతం ఉన్న కోట రాజవైరిని అనుకుని అప్పట్లో శ్రీరాజాకాకర్లపూడి రామచంద్రరాజు బహుద్దూర్‌ కోటను నిర్మించారు. గోదావరి వరదల్లో ఆ కోట మునిగిపోయింది. బొబ్బిలిపై యుద్ధం అనంతరం విజయనగరం రాజు అనందరాజు ఈస్టిండియా కంపెనీతో ఒరిస్సాలోని పారాదీప్‌ ఓడరేవులో చేసుకున్న ఒప్పందం ప్రకారం తీరప్రాంతాన్ని కంపెనీకి, ఎస్టేట్‌లను విజయనగరం రాజులకు ఇచ్చేందుకు అంగీకరించారు.

Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

1842లో నిర్మాణం..

ఈస్టిండియా కంపెనీ కోటిపల్లి ఎస్టేట్‌ను వీడాలని చెప్పటంతో అప్పట్లో పెంకులపాడు, తాళ్లపొలం, ముచ్చుమిల్లి ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాజరాజ నరేంద్రుడు కట్టిన సబ్‌కోర్టుగా ఉండే బురుజుల మధ్యలోనే 1842లో రాజా కాకర్లపూడి రామచంద్రరాజు ప్రస్తుతం ఉండే కోటను నిర్మించారు. విజయనగర రాజ్యానికి కప్పాన్ని చెల్లిస్తూ ఈ ప్రాంతాన్ని పాలించారు. రామచంద్రరాజు కోటను నిర్మించటంతో పెంకులపాడు, తాళ్లపొలం, ముచ్చుమిల్లి మూడు ప్రాంతాలకు కలిపి రామచంద్రపురంగా నామకరణం జరిగింది.

ఎస్టేట్‌లు, తీరప్రాంతాల విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న కోటిపల్లి తీర ప్రాంతం విజయనగర మాన్సాస్‌ భూములుగా ఏర్పడి వారి స్వాధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి రాజా కాకర్లపూడి వంశీయులు పాలిస్తూ వచ్చారు. రాజా రామచంద్రరాజు వద్ద నుంచి నేటి వరకు 8 తరాల ఈ వంశానికి చెందిన వారు ఈ కోట ద్వారా పాలన సాగించారు. ప్రస్తుతం కాకర్లపూడి రాజగోపాలనరసరాజు(గోపాలబాబు), కాకర్లపూడి వెంకటరాఘవరాజు(కిషోర్‌బాబు)లు 8వ తరగంగా ఉండగా వారి కుమారులు 9వ తరం వారు కూడా వారసులుగా ఉన్నారు. వీరు ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి ఆలయానికి అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

అలనాటి రాజుల కాలం గుర్తులునేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. నేటి తరం వారు వాటిని చూస్తూ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కె.గంగవరం మండలం రాజవైరిలో మొట్టమొదటిగా నిర్మించిన కోట ప్రస్తుతం గోదావరిలో భాగంగా మారింది. నేటికి అక్కడి వారిలో గోదావరిలో చూపిస్తూ అదిగో రాజుగారి కోట అని చెబుతుంటారు. కాకర్లపూడి నరసరాజు నిర్మించిన కొత్త కోట ఇలా ఠీవీగా గత వైభవ చిహ్నంగా మనకు కనిపిస్తుంది. నేటికి కాకర్లపూడి వంశీయులకు ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి.

సినిమాల్లోనూ దర్శనం..

ఈ కోట అనేక సినిమాల్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో షూటింగ్‌లు జరిగాయి. పెద్ద స్టార్స్‌ నటించిన సినిమాల్లో ఉమ్మడి కుటుంబాలు, వారి దర్పం ఉట్టిపడేలా రాజప్రసాదం చూపించాలనుకున్నప్పుడు సినీ దర్శకులు ఈ కోటనే ఎన్నుకొనేవారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుచందర్‌ నటించిన సూత్రధారులు, హీరో కృష్ణ ఊరికిమోనగాడు, కృష్ణంరాజు, సుమన్‌ల బావ బావమరిది, మహేష్‌బాబు మురారి వంటి సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?

Show comments